1000 కోట్ల 'మ‌హాభార‌తం' లేన‌ట్టేనా?

Update: 2018-08-08 06:50 GMT
`బాహుబ‌లి` సంచ‌ల‌న‌ విజ‌యంతో ర‌గిలిపోయిన బాలీవుడ్‌ లో ఇటీవ‌ల‌ చాలా మార్పులే క‌నిపిస్తున్నాయ్‌. జ‌క్క‌న్న ఇచ్చిన జోల్ట్ త‌ర్వాత‌ హాలీవుడ్ త‌ర‌హాలో యూనివ‌ర్శ‌ల్‌ స‌బ్జెక్ట్స్ ఎంచుకుని ఖాన్‌ ల త్ర‌యం భారీ ప్ర‌యోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి మార్కెటింగ్ స్ట్రాట‌జీని ప‌రిశీలించి జ్ఞానం తెచ్చుకోవాల‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వంటి ప్ర‌ముఖులు గ‌డ్డి పెట్ట‌డంతో అంతా జాగ్ర‌త్త ప‌డ్డారు. అయితే బాలీవుడ్‌ లో ప్ర‌యోగాల‌కు కొద‌వేం లేద‌ని మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ ఖాన్ ఏనాడో ప్రూవ్ చేశాడు. అంతేకాదు ఉత్త‌రాది సినిమా మార్కెట్‌ని చైనా - జ‌పాన్ లాంటి చోట కొత్త పుంత‌లు తొక్కించిన మ‌హా మేధావి అమీర్‌. అందుకే అంత‌టి దిగ్గ‌జం `మ‌హాభార‌తం 3డి`ని 1000 కోట్ల బ‌డ్జెట్‌ తో ఐదు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నాను అన‌గానే అంద‌రిలోనూ ఒక‌టే ఉత్కంఠ‌. వేల‌కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించే అతిభారీ ప్రాజెక్టును అమీర్ చేప‌ట్టాడ‌ని అంద‌రూ భావించారు. 3డిలో పాండ‌వ వ‌న‌వాసం - మ‌హాభార‌త యుద్ధం చూడాల‌ని అంతా తెగ ముచ్చ‌ట‌ప‌డ్డారు.

అయితే ఆ ముచ్చ‌ట మూణ్ణాళ్ల ముచ్చ‌టేన‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. మిస్ట‌ర్ పెర్ ఫెక్ట్ ఇటీవ‌లి కాలంలో చ‌డీచ‌ప్పుడు చేయ‌క సైలెంటుగా ఉన్నాడెందుకో. అత‌డి దృష్టి అంతా `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`పైనే. ఈ సినిమాలో అమీర్ బందిపోటుగా న‌టిస్తున్నాడు. బిగ్‌ బి అమితాబ్ స‌హా భారీ కాస్టింగ్‌ తో అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అయితే ఈ బిజీలో మ‌హాభార‌తం మాట మ‌రిచాడ‌ని భావిస్తే - ఆ వెంట‌నే అత‌డు మ‌రో బిగ్ బాంబ్ పేల్చాడు. నిన్న‌గాక మొన్న టీ-సిరీస్ గుల్ష‌న్ కుమార్ బ‌యోపిక్ తెర‌కెక్కించే ప్లాన్‌ లో ఉన్నాన‌ని అమీర్ అన‌డంతో కొత్త సందేహాలు రాజుకున్నాయి. అమీర్ ప్ర‌స్తుతం ఏం ఆలోచిస్తున్నాడు? అత‌డి మైండ్‌ లో ఏం తిరుగుతోంది? మ‌హాభార‌తం 3డి తెర‌కెక్కించ‌డం లేదా? అంటూ అభిమానుల్లో బోలెడ‌న్ని సందేహాలు రాజుకుపోతున్నాయ్‌.

మ‌రి అలాంట‌ప్పుడు అంత ఘ‌నంగా రిల‌య‌న్స్ అంబానీల‌తో క‌లిసి ఎందుకు బిగ్ స్కెచ్ వేశాడు? ప‌దేళ్ల పాటు ఇక మ‌హాభార‌తం చిత్రీక‌ర‌ణ‌లో బిజీ అయిపోతాన‌ని అమీర్‌ ఎందుకు ప్ర‌క‌టించాడు? అంటూ అంతా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. 1986లో రామానంద్ సాగ‌ర్ తెర‌కెక్కించిన రామాయ‌ణం - అటుపై 1988లో బి.ఆర్.చోప్రా తెర‌కెక్కించిన మ‌హాభార‌తం కేవ‌లం టీవీ సీరియ‌ళ్లుగా బుల్లితెర వీక్ష‌కుల్ని అప్ప‌ట్లో అల‌రించాయి. కానీ ఇన్నేళ్ల‌లో ఈ భారీ ఎపిక్స్‌ ని హాలీవుడ్ రేంజులో తీయాల‌న్న ఆలోచ‌న ఒక్క‌రంటే ఒక్క‌రికీ రాలేదు. అమీర్‌ ఖాన్‌ - రాజ‌మౌళి - అల్లు అర‌వింద్‌ - మోహ‌న్‌ లాల్‌ వంటి వాళ్ల‌కు ఆ ఆలోచ‌న ఉన్నా ఆచ‌ర‌ణ‌లో మాత్రం అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతూనే ఉంది. ఇది ఫ్యాన్స్‌ ని తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తోంది.
Tags:    

Similar News