బ్ర‌హ్మాస్త్ర బ్రేక్ ఈవెన్ క‌ష్ట‌మేనా?

Update: 2022-09-15 07:31 GMT
బాలీవుడ్ గ‌త కొన్ని నెల‌లుగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోలు, క్రేజీ స్టార్స్ న‌టించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్ గా నిలుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ని కాపాడేది ఎవ‌రు? మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని తీసుకొచ్చేది ఎవ‌రు అనే చ‌ర్చ మొద‌లైంది. బిగ్ స్టార్స్ న‌టించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డుతుండ‌టంతో అంద‌రి దృష్టి క‌ర‌ణ్ జోహార్ 'బ్ర‌హ్మాస్త్ర‌'పై ప‌డింది.

ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ జంట‌గా న‌టిస్తే.., అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌, డింపుల్ క‌పాడియా, మౌనీరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలాగైనా బాలీవుడ్ కు మంచి రోజుల్ని తీసుకొస్తుంద‌ని అంతా ఆశ‌గా ఎదురుచూశారు. అయితే ప్రారంభం నుంచి మూవీపై పాజిటివ్ టాక్ వున్నా టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో ప్రేక్ష‌కుల్ని 'బ్ర‌హ్మాస్త్ర‌' నిరాశ‌ప‌రుస్తూ వ‌చ్చింది. ప్ర‌ధానంగా గ్రాఫిక్స్ చాలా నాసిర‌కంగా వున్నాయంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు వినిపించాయి.

ఆ త‌రువాత బాయ్ కాట్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. సినిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా బాయ్ కాట్ చేయాలంటూ పోస్ట్ లు పెడుతూ వైర‌ల్ అయ్యేలా చేసింది. ఇన్ని అడ్డంకుల్ని అధిగ‌మించి మొత్తానికి సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన 'బ్ర‌హ్మాస్త్ర‌' అనూహ్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. బాయ్ కాట్ ట్రెండ్ ని ప‌ట్టించుకోని ప్రేక్ష‌కులు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవ‌డంతో 'బ్ర‌హ్మాస్త్ర‌' ఊహించ‌ని విధంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.  

తొలి రోజు, వీకెండ్ లో ఈ మూవీ సాధించిన వ‌సూళ్లు బాలీవుడ్ కు భారీ ఊర‌ట క‌లిగించాయి. డివైడ్ టాక్ వున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ అన్ని భాష‌ల‌కు క‌లిసి ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 267.29 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇలా ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలోనూ ఈ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం అంత ఆషామాషీ కాదు. అయితే వీకెండ్ వ‌ర‌కు జోరు చూపించిన ఈ మూవీ ఒక్క‌సారిగా డౌన్ ఫాల్ అవుతూ వ‌స్తుండ‌టం షాకిస్తోంది.

సినిమా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం వ‌ల్లే ప్రేక్ష‌కులు ఈ మూవీని పెద్ద‌గా ఆద‌రించ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇదే పరిస్థితి ఇలాగే కొన‌సాగితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధించ‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మొద‌టి వారాంతం త‌రువాత ఈ మూవీ జోరు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతుండ‌టంతో ఇక బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మే అని ట్రేడ్ వ‌ర్గాలు తేల్చేస్తున్నాయి. ఇప్ప‌టికే 60 శాతం వ‌ర‌కు వ‌సూళ్లు త‌గ్గిపోవ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

రూ. 410 కోట్ల‌తో రూపొందించిన ఈ మూవీ అంత‌కు మించి రాబ‌ట్ట‌గ‌లిగితేనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. కానీ అది జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. దీంతో 'బ్ర‌హ్మాస్త్ర‌' రూపంలో బాలీవుడ్ కు మ‌రో భారీ డిజాస్ట‌ర్ ఖాయం అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News