'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్.. వెంకీమామ పర్ఫెక్ట్ పండగ సినిమా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ''సంక్రాంతికి వస్తున్నాం''. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల కంటెంట్ కు అనూహ్య స్పందన లభించింది. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ 'ఎక్స్' లో పోస్ట్ చేస్తూ ''చూస్తుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేలా ఉంది. మా పెద్దోడు వెంకటేష్, నా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి చేసిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ హ్యాట్రిక్ విజయం సాధించాలని, మొత్తం టీంకు ఈ సంక్రాంతి మెమరబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. జనవరి 14న సినిమా కోసం ఎదురు చూస్తున్నాను'' అని పేర్కొన్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లోకి వెళ్తే, కథంతా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి శ్రీనివాస్ అవసరాల కిడ్నాప్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలిస్తే అర నిమిషంలో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని అంటున్న నరేష్ వీకే.. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం కోసం పనిచేసేవాడు ఒక్కడు కావాలి అని అంటుండగా, ఎక్స్ కాప్ గా వెంకటేష్ ను చూపించారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అయిన వెంకీ తన ఎక్స్ లెంట్ వైఫ్ (ఐశ్వర్య రాజేష్) తో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే తమ అన్యోన్యమైన దాంపత్యానికి ద్రిష్టి పెట్టేవారే లేరని అనుకుంటుండగా.. వారి లైఫ్ లోకి వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రస్తుతం పోలీసుగా ఉన్న మీను (మీనాక్షి చౌదరి) ఎంట్రీ ఇచ్చింది.
కిడ్నాప్ కేసును పరిష్కరించడంలో సహాయం కోరుతూ వెంకీ ఫ్యామిలీకి మీనాక్షి ఎంటర్ అయిన తర్వాత, వారి ప్రశాంతమైన జీవితం చెదిరిపోతుంది. మీ ఆయన మీద ఎలాంటి ఫీలింగ్ లేదని మీను చెప్పినా, భాగ్యం మనసులో ఎక్కడో చిన్న అనుమానం మొదలవుతుంది. అందుకే ఈ ఆపరేషన్ లో తన భర్తతో పాటుగా వెళ్లాలని భాగ్యం నిర్ణయించుకుంది. ఎక్స్ కాప్, ఎక్స్ లెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కలిసి మిషన్ చేపట్టిన తర్వాత అసలైన ఛాలెంజ్ ఎదురైనట్లు ట్రైలర్ లో చూపించారు. అక్కడి నుంచి ఈ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టునేలా సాగింది.
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సరికొత్త జోనర్ లో తనకు కలిసొచ్చిన కామెడీని పండించే ప్రయత్నం చేసారు. ఒక రెగ్యులర్ ఎంటర్‌టైనర్ లా కాకుండా, ఈసారి పూర్తి భిన్నమైన ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నారని హింట్ ఇచ్చారు. ట్రైలర్‌లో సూచించినట్లుగా సినిమాలో ఎన్నో ట్విస్టులు, థ్రిల్స్, యాక్షన్, డ్రామా ఉండబోతున్నాయని తెలుస్తోంది. వెంకటేష్ ఎప్పటిలాగే తనకు అలవాటైన పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. కామెడీ, ఫ్యామిలీ డైనమిక్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో అవలీలగా నటించారు. ముఖ్యంగా భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
''ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఒక టీజర్ ఉన్నట్లు, ప్రతీ మగాడికి పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ నేచురల్'' అని వెంకీ చెప్పే డైలాగ్, చివర్లో దయచేసి పెళ్ళాలకు ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీని చెప్పకండి అంటూ తనదైన శైలిలో ఏడుస్తూ చెప్పే సీన్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఆదర్శవంతమైన భార్యగా, కాస్త ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఆకట్టుకుంది. వెంకటేష్ మాజీ ప్రియురాలుగా, దృఢనిశ్చయం కలిగిన పోలీసుగా మీనాక్షి చౌదరి కనిపించింది. ట్రైలర్ కు కాస్త గ్లామర్ ను జోడించింది. 'ప్రెస్ మీట్ పెట్టి పెంట పెంట చేస్తా' 'హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతీసారి విక్టరీ' అంటూ 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమాయే తన సొంత వాయిస్ తో చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి. వీటీ గణేష్, సాయి కుమార్, పృథ్వీరాజ్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
ఓవరాల్ గా ఫన్, యాక్షన్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా కలబోసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాంకేతిక పరంగా విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లే అందించారు. సంక్రాంతికి హాయిగా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా, పర్ఫెక్ట్ పండుగ సినిమాగా రెడీ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.