జూనియర్ పూరీ సెట్ అయినట్లేనా... ?

Update: 2021-10-31 00:30 GMT
పూరీ జగన్నాధ్ టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ గా చెబుతారు. ఆయన ఆలోచన వేరుగా ఉంటుంది. ఆ దృక్కోణం కూడా డిఫరెంట్ అని చెప్పాలి. అందరికీ ఇడియట్ లో తిట్టు వినిపిస్తే పూరీకి అద్భుతమైన ప్రేమికుడు కనిపించాడు. ఇక పూరీ పోకిరిలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. బిజినెస్ మెన్ అంటూ మహేష్ బాబు లాంట్ స్మార్ట్ హీరోతో మ్యాజిక్ చేసినా టెంపర్ అంటూ ఎన్టీయార్ లాంటి మాస్ హీరోని వేరే లెవెల్ లో చూపించినా పూరీకే చెల్లు. ఇక పూరీ మార్క్ డైలాగ్స్ ఎపుడూ చెవుల్లో మారు మోగుతూంటాయి. పూరీ కొత్త వారికి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. రవితేజా ని మాస్ మహారాజాని చేసిన క్రెడిట్ ఆయన సొంతం

తన ఇంట్లో సొంత తమ్ముడు సాయి రామ్ శంకర్ ని పెట్టి కొన్ని సినిమాలు తీసి హిట్లూ ఫట్లూ రెండూ చూశాడు. ఇపుడు అదే పూరీ ఇంట్లో నుంచి వారసుడు ఆకాష్ హీరోగా ముందుకు వచ్చాడు. మెహబూబా మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ ఈసారి పూరీ పర్యవేక్షణలో అనిల్ పాడూరి డైరెక్షన్ లో రొమాంటిక్ అంటూ జనాల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా హీరోగా ఆకాశ్ పూరీకి మంచి మార్కులే పడ్డాయి. ఆకాశ్ నటన గురించి చెప్పుకుంటే బాగా మెచ్యూరిటీ కనిపించింది అని అంతా అంటున్నారు. ఇక క్లైమాక్స్ సీన్లలో కూడా బాగా చేశాడు అని చెబుతున్నారు.

మొత్తానికి ఆకాశ్ పూరీలోని ఫైర్ చాలానే ఉందని అంటున్నారు. చాన్నాళ్ళ త‌ర్వాత టాలీవుడ్ కి జూనియర్ పూరీ రూపంలో యంగ్ బ్లడ్ తో కూడిన హీరో మెటీరియల్ లభించింది అంటున్నారు. మినిమం బడ్జెట్ లో సరైన కధ ఎంచుకుని ఆకాశ్ ని హీరోగా పెట్టి తీస్తే సేఫ్ జోన్ లో సక్సెస్ చూడడం ఖాయమని కూడా అంతా అంటున్నారు. ఇక పూరీ సమకాలీనులు అయిన డైరెక్టర్లు రాజమౌళి మెహెర్ రమేష్ వంటి వారు కూడా నటనాపరంగా శభాష్ ఆకాశ్ అన్నారు.

ఆకాశ్ బాబాయ్ సినీ హీరో అయిన సాయి రామ్ శంకర్ అయితే అబ్బాయ్ రాకింగ్ అనేశాడు. నటనలో హావభావాలు పలికించడంలో ఆకాశ్ ఎక్కడికో వెళ్లిపోయాడని కితాబు ఇచ్చారు. పూరీ జగన్నాధ్ ది విశాఖ జిల్లా నర్శీపట్నం. దాంతో ఆ ఊరిలో అయితే అంతా సంబరాలే చేసుకుంటున్నారు. మా ఊరి కుర్రోడు హీరో అంటూ తెగ మురుస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ కి మరో స్మార్ట్ హీరో దొరికేశాడు ఆకాశ్ రూపంలో అంటున్నారు. సో. జూనియర్ పూరీ సరైన సబ్జెక్ట్ తో వస్తే కనుక టాలీవుడ్ లో సెట్ అయినట్లేనని చెబుతున్నారు అంతా.
Tags:    

Similar News