'మై హోమ్' మరో రంగ ప్రవేశం?

Update: 2022-03-16 05:30 GMT
నిర్మాణ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న 'మై హోమ్' గ్రూపు ప్రస్థానం ఇప్పుడు వివిధ రంగాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే మీడియా, వినోదరంగాల్లో మైహోమ్ గ్రూపు అడుగుపెట్టింది.

తెలుగులో నంబర్ 1 న్యూస్ చానెల్ తోపాటు తెలుగు ఓటీటీలో పెట్టుబడులు పెట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ నిర్మాణ రంగ గ్రూపు సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెడుతున్నట్టు తెలిసింది.

భారీగా డబ్బులున్న ఈ సంస్థ ముందుగా డైరెక్ట్ గా తమ బ్రాండ్ తో రాకుండా కొన్ని బడా నిర్మాణ సంస్థల్లో భాగస్వామిగా అడుగుపెడుతోంది. వారికి నిధులు సమకూర్చి.. వాటా తీసుకుంటారు. బ్యానర్, పేరు ప్రస్తుతానికి ఇంకా డిసైడ్ చేయలేదు. అయితే తర్వలోనే బ్యానర్ ఫిక్స్ అయ్యాక ఆ పేరుతో సినిమా రంగంలోకి దిగి సినిమాలు నిర్మించాలన్నది మై హోం గ్రూప్ ప్లాన్ గా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగులో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 25శాతం వాటాను మైహోమ్ గ్రూప్ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మహేష్-త్రివిక్రమ్ మూవీ నిర్మిస్తున్న బ్యానర్ లోనూ మైహోమ్ కు వాటా ఉన్న భోగట్టా.. ఇదే విధంగా మరికొన్ని సంస్థలతో కూడా వాటాలు, పెట్టుబడులకు మైహోం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.ఇదే కనుక ఓకే తెలుగు సినిమా రంగంలో ఓ బడా పెట్టుబడిదారుగా మై హోం నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఆడియో రంగంలోకి కూడా మైహోం రావడానికి రెడీ అయినట్టు తెలసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనే ఆదిత్య, లహరీ మ్యూజిక్ లాగా మైహోం కూడా ఓ మ్యూజిక్ సంస్థను ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. సినిమాల ఆడియో, డిజిటల్ రైట్స్ తీసుకొని డిజిటల్ మార్కెట్ లోనూ పాగా వేయడానికి మైహోం గ్రూప్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ఆహాలో మెజార్టీ వాటాదారుగా ఉన్న మైహోం వీడియో స్ట్రీమింగ్ రైట్స్ వ్యాపారాన్ని విస్తరించే పనిలో కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ లో జరుగుతున్న ఈ ప్రచారం మరి నిజమో కాదో తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News