లవ్వులో సామజవరగమన అంటున్న అల భామ..?

Update: 2020-01-19 04:37 GMT
కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనేది ఒక ముతక సామెత.  దీనికి మనం మరో అంశాన్ని కూడా ఎంచక్కా జోడించవచ్చు.  అదే ప్రేమ.   వివాహాలు.. వాంతులు ఆగేందుకు సవాలక్ష ఉపాయాలు ఉన్నాయి కానీ లవ్వొస్తే మాత్రం ఆగనే ఆగదు. అది తగులుకుంటే రామజోగయ్య శాస్త్రి గారు చెప్పినట్టుగా బబుల్ గమ్ములా వదలదు. లాక్కో లేక పీక్కోలేక చావాలి.  సామజవరగమన నుంచి ఉండిపోరాదే దాకా ఎన్నో పాటలు పాడాలి. ప్రస్తుతం అల భామ పూజా హెగ్డే పరిస్థితి ఇలానే ఉంది ముంబై మీడియా కోడై కూస్తోంది.

సీనియర్ బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ తో ఈ డీజే భామ ప్రేమలో పడిపోయిందట.  అయితే ఈ విషయాన్ని ఎంతో సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తూ ఉందట. ఇలాంటి వాటిని ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నా ఉంచలేరు కదా.. అందుకే సీక్రెట్ కాస్తా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది.  ఇంతకీ ఈ రోహన్ ఏం చేస్తుంటాడు అంటే.. నటుడిగా బాలీవుడ్ లో సత్తా చాటాలనే కంకణం కట్టుకున్నాడు.  ఇప్పటికీ సైఫ్ అలీ ఖాన్ సినిమా 'బాజార్' లో నటించాడు.  ఆ సినిమాకు రోహన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం మెరుగైన అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ఈ  భామ ప్రేమలో పడిపోయాడట.  ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట.

అయితే ఒకరి గురించి ఒకరు ఏమాత్రం బయటపడడం లేదట.  మరి ఈ ప్రేమ ముదిరి పాకాన పడుతుందా.. ఘాటు ప్రేమగా మారుతుందా.. పెళ్లి వరకూ చేరుతుందా అనేవి ప్రస్తుతం సమాధానం లేని ప్రశ్నలు. ఏ నిముషానికి ఏమి జరుగుతునో ఎవరూహించలేరు కదా..!

Tags:    

Similar News