'ఆర్ఆర్ఆర్' తో తారక్ కు అంత నష్టమా?

Update: 2022-01-06 15:30 GMT
తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎంతగా ఎదురుచూస్తుంటే.. అంతగా వెనక్కి వెళుతున్న ఈ భారీ మూవీ మరోసారి విడుదల వాయిదా పడటం.. మరెప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమాకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో.. పెద్ద హీరోల చిత్రాలు సైతం తమ విడుదలను వాయిదా వేసుకోవటం తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు విడుదల విషయంలో వెనక్కి వెళ్లిన ఈ సినిమా మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాను నమ్ముకొని అడ్డంగా బుక్ అయిన వారిలో యంగ్ టైగర్ తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరన్న మాట చెబుతున్నారు. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక సినిమా చేసుకునే ఆయన.. తన శైలికి భిన్నంగా జక్కన్న చెక్కే ఆర్ఆర్ఆర్ శిల్పం కోసం విలువైన మూడేళ్ల సమయాన్ని వెచ్చించాడు. 2018లో అరవింద సమేతతో చివరిసారి థియేటర్లలో సందడి చేసిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ సినిమా చేసింది లేదు.

ఆర్ఆర్ఆర్ కోసం ఆయన సమాయాన్ని ఇవ్వటం.. అనూహ్యంగా విరుచుకుపడిన కరోనా దెబ్బకు 2020 దెబ్బ పడితే.. అంతకు ముందు ఏడాది.. ఆ తర్వాత ఏడాది ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత సినిమా చేద్దామని ఉండిపోయారు. ఒక సినిమా కోసం ఏకంగా మూడేళ్ల విలువైన సమయాన్ని కోల్పోయారు. టైం మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా భారీ నష్టమే జరిగిందన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. గతంలో తన ఒక్కో సినిమాకు తారక్ రూ.30 కోట్లు తీసుకుంటారని చెబుతారు. అరవింద సమేత తర్వాత ఆయన రేంజ్ రూ.50 కోట్లకు వెళ్లిందని చెబుతారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని మూడేళ్ల విలువైన కాలం పోయిన పరిస్థితి. ఒక పెద్ద హీరో సినిమా అంటే.. వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి ఒకటి చొప్పున వేసుకున్నా.. మూడేళ్లలో మూడు సినిమాలు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో మరో సినిమా వేసుకున్న.. నాలుగుసినిమాలు అయ్యేవి. అంటే..నాలుగు సినిమాలకు వచ్చేరెమ్యునరేషన్ తారక్ కు పోయిందని చెప్పాలి. ఇది కాక.. ఆయన నాలుగు సినిమాలు చేసి ఉంటే.. ఎన్నో వేల మందికి ఆయన కారణంగా ఉపాధి కలిగేది. ఇలా చూసినప్పుడు ఆర్ఆర్ఆర్ తారక్ ను నష్టపోయేలా చేసిందన్న మాట ఇండస్ట్రీ వర్గాల నోట వినిపిస్తోంది. గతంలో చేసిన తప్పు రిపీట్ చేయకుండా.. ఈసారి వరుస పెట్టి సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News