మోహన్ బాబు చిరుల మధ్య మళ్ళీ... ?

Update: 2021-10-05 02:30 GMT
విలక్షణ నటుడు, కలెక్షన్  మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరో. ఆయన నట జీవితం. నాలుగున్నర దశాబ్దాలు దాటింది. ఒక నిర్మాతగా, హీరోగా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు మరపు రాని పాత్రలతో విశేషంగా అలరించారు. ఇక మోహన్ బాబు తరువాత సినీ పరిశ్రమకు  వచ్చిన చిరంజీవి మెగా స్టార్ అయ్యారు. ఈ ఇద్దరూ ఎనభై దశకం మొదట్లో కలసి కొన్ని సినిమాలు చేశారు. అవి మంచి హిట్లు అయ్యాయి. ఆ విధంగా టాలీవుడ్ లో వీరి కాంబో ఆకట్టుకుంది. ఇక ఆ మధ్యలో మోహన్ బాబు విలన్ గానూ చిరంజీవి సినిమాల్లో నటించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మోహన్ బాబు ముక్కు సూటిగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దాంతో కొన్ని సందర్భాలలో ఆయన ఇబ్బందిపడిన సంఘటనలు ఉన్నాయి.

ఇక మోహన్ బాబు చిరంజీవిల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అవి బట్టబయలు అయింది మాత్రం తెలుగు చలన చిత్ర సీమ వజ్రోత్సవ వేడుకలలోనే తొలిసారి జరిగింది.  అప్పట్లో సెలిబ్రిటీ ఎవరు, లెజెండ్ ఎవరు అన్న దాని మీద వచ్చిన వివాదం చివరికి మోహన్ బాబు వర్సెస్ చిరుగా మారింది. అయితే ఆ తరువాత కూడా ఇద్దరు కలసి మెలసి సందడి చేశారు. ఆ మధ్య మా అసోసియేషన్ ఉత్సవాలలో కూడా చిరు మోహన్ బాబు ముద్దులు పెట్టుకుని మరీ అందరికీ షాక్ ఇచ్చారు. తమ మధ్య విడదీయని స్నేహం ఉందని చాలా సందర్భాల్లో మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా జరుగుతున్న మా ఎన్నికలు మాత్రం ఇద్దరు మధ్యన చిచ్చు పెట్టాయనే అంటున్నారు. మంచు విష్ణు ప్యానల్ ఒక వైపు ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ మరో వైపు ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వెనక మెగా కాంపౌండ్ ఉందని ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన తనకు స్నేహితుడు అని అన్నారు. అది తన వైపు నుంచి అని  కూడా ట్విస్ట్ ఇచ్చారు. అంటే చిరంజీవి వైపు నుంచి మోహన్ బాబు స్నేహితుడు కాడా ఏంటి అన్న డౌట్ అయితే వచ్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. అదీ కాకుండా తన కొడుకు విష్ణు  చిరుతో మాట్లాడే ప్రయత్నం చేసినా అటు నుంచి రెస్పాన్స్ లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇక మోహన్ బాబు మాత్రం చిరు బిడ్డ తన బిడ్డ అని చెప్పుకున్నారు, మరి అదే విష్ణు  చిరు బిడ్డ కాదా అన్న అర్ధం వచ్చేలా ఆయన  మాట్లాడారు.  అదే టైమ్ లో సినీ రంగంలో పెద్దలు ఎవరూ లేరని, దాసరి తోనే ఆ పెద్దరికం పోయింది అన్న మోహన్ బాబు తాజా కామెంట్స్ కూడా చిరుని ఉద్దేశించే అని అంటున్నారు. ఎవరైనా తాము పెద్దలమని చెప్పుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేయాలని కూడా ఆయన అన‌డమూ విశేషం.   మరో వైపు చూస్తే రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మోహన్ బాబుని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ పట్ల కూడా ఆయన ఫైర్ అయ్యారని, దానికి కూడా తొందరలోనే జవాబు చెబుతారని అంటున్నారు.

మొత్తానికి మోహన్ బాబు మాత్రం మా ఎన్నికల విషయంలో తన కొడుకు విష్ణుకు  మెగా క్యాంప్ నుంచి మద్దతు లేకపోవడం పట్ల బాగా  అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. మా ఎన్నికల నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన్ని బాగా హర్ట్ చేశాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే మాత్రం చిరు మోహన్ బాబుల స్నేహ బంధానికి మళ్ళీ అగ్ని పరీక్ష ఎదురైనట్లుగానే ఉందని అంటున్నారు. అయితే మోహన్ బాబు చిరుల మధ్య ఎపుడూ ఇలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే అని ఈ ఎన్నికలు అయ్యాక మళ్ళీ ఇద్దరు ఒక్కటి అవుతారని అన్న వారూ ఉన్నారు. చూడాలి మరి.
Tags:    

Similar News