#గుస‌గుస‌.. NTR 30 లాంచ్ డేట్ ఇదేనా?

Update: 2022-10-28 04:20 GMT
ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రంలో న‌టించేందుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ‌ల్క్ గా త‌మ కాల్షీట్ల‌ను కేటాయించిన సంగ‌తి తెలిసిందే. కానీ రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ఆచార్య‌లో న‌టించేశాడు. కానీ తార‌క్ మాత్రం పూర్తిగా ఆర్.ఆర్.ఆర్ కోస‌మే అంకిత‌మైపోయాడు. అత‌డు న‌టించిన సోలో సినిమా రిలీజై చాలా కాలం కావ‌డంతో అభిమానులు త‌దుప‌రి చిత్రం ప్ర‌క‌ట‌న గురించి ఆత్రంగా వేచి చూస్తున్నారు. కొర‌టాల‌తో మూవీ ఈపాటికే ప్రారంభం కావాల్సి ఉన్నా అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. త్రివిక్ర‌మ్ తో తార‌క్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావ‌డం కూడా ఈ డిలేకి కొంత కార‌ణం.

దానికి తోడు పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాత‌ తార‌క్ మారిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొర‌టాల కొత్త స్క్రిప్టును రాయాల్సిన స‌న్నివేశం ఎదురైంది. అప్ప‌టికే రెడీ చేసిన స్క్రిప్టును వ‌దిలేసి అత‌డు పూర్తిగా మ‌రో కొత్త స్క్రిప్టును రెడీ చేసి ఇప్ప‌టికి తార‌క్ ని ఒప్పించాడ‌ని టాక్ ఉంది.

తాజా స‌మాచారం మేర‌కు జ‌పాన్ లో ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్ ని ముగించి తార‌క్ - చ‌ర‌ణ్ ఇప్ప‌టికే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. త‌దుప‌రి త‌మ ప్రాజెక్టుల‌పై ఆ ఇద్ద‌రూ దృష్టి సారించ‌నున్నారు. ముఖ్యంగా తార‌క్ వెంట‌నే కొర‌టాల‌తో సినిమాని ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే కొర‌టాల‌ స్క్రిప్ట్  ఫైనల్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసాడు. స్క్రిప్టు అద్భుతంగా వ‌చ్చింది. నేటి ట్రెండ్ కి త‌గ్గ స్టోరీ ఇద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి  పాన్ ఇండియా అప్పీల్ ఉన్న యూనివ‌ర్శ‌ల్ క‌థాంశాన్ని వినిపించ‌నున్నార‌ని అలాగే ఇద్దరూ లాంచ్ కి తగిన ముహూర్తం ఖరారు చేస్తారని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నవంబర్ రెండో వారంలో సెట్స్ పైకి వెళ‌తార‌ని... డిసెంబర్ లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావచ్చ‌ని అంచ‌నాలున్నాయి. ఈ జోడీ నిర్మాత‌లు సుధాకర్ మిక్కిలినేని- కళ్యాణ్ రామ్ ల‌తో చ‌ర్చించి ఒక లాంచ్ డేట్ ని ప్ర‌క‌టించేస్తార‌ని చెబుతున్నారు. అభిమానులు కూడా ఆ అద్భుత క్ష‌ణం కోసం ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు.

క‌థాంశం ఎలా ఉండ‌బోతోంది?ఎన్‌.టి.ఆర్ 30 స్క్రిప్టింగ్ కోసం కొర‌టాల సుదీర్ఘ స‌మ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ఈ స్క్రిప్టుపై ప‌ని చేయ‌గా ఫైన‌ల్ ఔట్ పుట్ వ‌చ్చింద‌ని స‌మాచారం. నిజానికి విద్యార్థుల రాజకీయాల చుట్టూ క‌థ‌ను రాసుకున్నా ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా మ‌రో కొత్త క‌థ‌ను కొర‌టాల ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది.

ఈ కొత్త స్క్రిప్టు ప్ర‌కారం.. ఫిలింన‌గ‌ర్ గుస‌గుస ఇలా ఉంది. ఇది గరుడ పురాణం ఆధారంగా రూపొందించిన క‌థతో తెర‌కెక్క‌నుంది. పక్షుల రాజు గ‌రుడ‌కు... విష్ణువుకు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా పురాణేతిహాస క‌థ‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక ద్వితీయార్థంలో అంత్యక్రియల కర్మలు - పునర్జన్మల‌కు కార‌ణ‌మ‌య్యే మెటాఫిజిక్స్ వంటి అంశాల‌తో అనుసంధానించబడిన సమస్యల‌ను తెర‌పై చూపిస్తార‌ని స‌మాచారం.

దీనిని బ‌ట్టి ఎంచుకున్న క‌థాంశం మ‌రింత హైప్ పెంచుతోంది. ఎన్‌.టిఆర్ 30 పై అమాంతం అంచనాలను పెంచుతోంది. ఆచార్య పరాజయం తరువాత ఎన్‌.టి.ఆర్ 30 కొరటాలాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. ఆర్.ఆర్.ఆర్ తో వ‌చ్చిన ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా ఇప్పుడు తారక్ కూడా స్క్రిప్టు ఎంపిక విష‌యంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News