త్రివిక్ర‌మ్ ఇంట్లో ఐటీ సోదాలు?

Update: 2019-12-25 05:15 GMT
వెంటాడు వేటాడు! అన్న‌ది ఓ సినిమా టైటిల్. ఇప్పుడు హైద‌రాబాద్ లో నివాసం ఉంటున్న సినిమావాళ్ల ప‌రిస్థితి ఇలానే ఉంది. సెల‌బ్రిటీలు ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌కుండా జీఎస్టీ అధికారులు వెంటాడు వేటాడు! త‌ర‌హాలో వెంబ‌డించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల ఇండస్ట్రీ దిగ్గ‌జాల ఇళ్ల‌లో ఐటీ-జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది జీఎస్టీ అధికారుల‌కు నిత్య‌వ్యాప‌కంగా మారింది. మొన్న‌టికి మొన్న అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠిని కంగారు పెట్టారు. అటుపై ప్ర‌ముఖ‌ యాంక‌ర్ల ఇళ్లు-కార్యాల‌యాల‌పైనా ఆక‌స్మిక‌ సోదాలు నిర్వ‌హించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

ఇంత‌లోనే స్టార్ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇంట్లోనూ.. జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వ‌హించార‌న్న వార్త ఉలిక్కిపాటుకు గురి చేసింది. ప్ర‌ముఖ‌ నిర్మాణ సంస్థలు హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌- సితార‌ ఎంటర్ టైన్ మెంట్స్‌ కార్యాలయాల్లోనూ ఇటీవ‌ల సోదాలు నిర్వ‌హించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఆ క్ర‌మంలోనే హారిక హాసిని నిర్మాత‌ల‌కు స‌న్నిహితుడైన త్రివిక్ర‌మ్ పైనా జీఎస్టీ సోదాలు నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు.. స్టార్ రైట‌ర్ కం డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఇళ్ల‌పైనా జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. ఇక సినిమావాళ్ల‌కు సంబంధించిన జాబితాను సిద్ధం చేసుకుని మ‌రీ జీఎస్టీ అధికారులు అట‌కాయిస్తున్నార‌న్న చ‌ర్చ ఫిలింన‌గ‌ర్ ని వేడెక్కిస్తోంది. హైద‌రాబాద్ స్థానికంగా ఉన్న వ్యాపారస్థులు- ఫైనాన్స్‌ సంస్థలు- బిల్డర్స్‌- దర్శక నిర్మాతలకు చెందిన 15 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు స‌మాచారం ఉంది. తప్పుడు ధ్రువపత్రాలను చూపించి చెల్లించాల్సిన జిఎస్టీలో త‌ప్పుడు లెక్క‌లు చూపించార‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. స‌మ‌ర్పించిన ప‌త్రాల‌కు లెక్క‌ల‌కు ఏమాత్రం పొంత‌న లేక‌పోవ‌డంతో ఈ దాడులు మ‌రింత ముమ్మ‌రం చేస్తున్నార‌ట‌. ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రికి ఎలాంటి తాఖీదులు అందనున్నాయో ఇప్పుడే చెప్ప‌లేమ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.



Tags:    

Similar News