``కృష్ణానగరే మామ....కృష్ణానగరే మామ....ఎటు చూసిన కలలే మామ...ఎటు చూసిన కథలే మామ....ఎన్నో కన్నీళ్లు ఉంటాయి...ఎన్నో కష్టాలు ఉంటాయి....``అంటూ ఓ సినీకవి కళాకారుల `కలల` వెనుక ఉన్న కన్నీటి గాథలకు అక్షర రూపం ఇచ్చారు. రవితేజ - పూరీ జగన్నాథ్ వంటి ఎంతోమంది అదే కృష్ణానగర్ లో కష్టనష్టాలకోర్చి ఇప్పుడు ఓ స్థాయికి వచ్చారు. జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియన్ వేణు కూడా....అదే తరహాలో నానా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు తన కెరీర్ బిగిన్ కాక ముందు జరిగిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు తెలిసిన ఓ సినీ జర్నలిస్ట్ దయ వల్లే తాను ఈ రోజు నటుడినయ్యానని చెప్పాడు.
సినిమా అనేది ఓ రంగుల కల అని - దానిని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది సినీ రంగంలోకి అడుగుపెడుతుంటారని వేణు చెప్పాడు. అయితే, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం, రాణించడం అంత సులువు కాదని చెప్పాడు. స్వానుభవంతో ఆ విషయాన్ని తెలుసుకున్నానని అన్నాడు. సినిమాల్లోకి రాకముందు తాను కృష్ణానగర్లో 'చిత్రం' శీను దగ్గర అసిస్టెంట్ గా ఉన్నానని చెప్పాడు. అనుకోకుండా అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చిందని - అయితే - ఆ తర్వాత ఎలా బతకాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డానని అన్నాడు. అయితే, నటుడిని కావాలనే బలమైన కోరిక మనసులో ఉందన్నాడు. అప్పట్లో తన పక్క రూమ్ లో ఉండే కొత్తపల్లి శేషు అనే సినీ జర్నలిస్ట్ తన పరిస్థితి చూసి 'జై' సినిమా ఆడిషన్స్ కు తన ఫొటోలు పంపించారని తెలిపాడు. ఆ ఆడిషన్స్ కు వెళ్లేందుకు కూడా ఆయన సహకరించారని చెప్పాడు. ఆ సినిమాలో చాన్స్ వచ్చిందని, షూటింగ్ కు వెళ్లేందుకు శేషు గారు 5 జతల బట్టలు కొనిపెట్టారని గుర్తు చేసుకున్నాడు. నా కోసం ఆయనని దేవుడే పంపించాడని నమ్ముతానని, ఆయన వల్లే ఈ రోజు తాను ఆర్టిస్ట్ కాగలిగానని చెప్పాడు.