14 కోట్లు తెచ్చి పెట్టిన ‘జై లవకుశ’

Update: 2017-04-25 06:48 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ మొదలై రెండు నెలలు మాత్రమే అయింది. షూటింగ్ ఇంకా యాభై శాతం కూడా పూర్తి కాలేదు. ఐతే అంతలోనే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి కనిపిస్తున్నట్లు సమాచారం. బిజినెస్ పరంగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట ఈ చిత్రానికి. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ‘జనతా గ్యారేజ్’ రూ.85 కోట్ల షేర్ తో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ.80 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ రికార్డులు నమోదవడం ఖాయమని తెలుస్తోంది.

‘జై లవ కుశ’ శాటిలైట్ హక్కులు రూ.14 కోట్లు పలికాయన్నది తాజా సమాచారం. ప్రముఖ టీవీ ఛానెల్ ‘జెమిని’ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందట. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఖరారవ్వకుండానే శాటిలైట్ హక్కులు అమ్ముడైపోవడం విశేషమే. డైరెక్టర్ బాబీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి డిజాస్టర్ తర్వాత తీస్తున్న సినిమా అయినప్పటికీ.. ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్న నేపథ్యంలో ‘జై లవకుశ’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదలైనప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘జై లవకువ’ ఆగస్టు నెలలో గుమ్మడికాయ కొట్టుకునే అవకాశముంది. ‘జనతా గ్యారేజ్’ రిలీజైన సెప్టెంబరు 1నే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News