జక్కన్న మౌనం వీడేది అప్పుడేనా..?

Update: 2021-06-11 00:30 GMT
సినిమాకు పబ్లిసిటీ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళిని మించిన దర్శకుడు ఉండడు అంటుంటారు. సినిమా స్టార్ట్ చేసేప్పుడే కథ ఏంటో చెప్పేసి జనాలను థియేటర్లకు రప్పించగలగే దర్శకుడాయన. సినిమా పూర్తవ్వడానికి నాలుగైదేళ్లు సమయం పట్టినా దాన్ని ప్రేక్షకుల్లో సజీవంగా ఉంచగలిగే స్ట్రాటజీలు జక్కన్న కు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. సినిమాకి మంచి బిజినెస్ జరిగేలా చూసుకునే రాజమౌళి.. అదే విధంగా జనాల్లో తన సినిమాని తీసుకుపోగలడు. ప్రస్తుతం ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'RRR'. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. అయితే ట్రిపుల్ ఆర్ విడుదల తేదీ విషయంలోనే జక్కన్న ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఏడాది సమ్మర్ లో వస్తుందని చెప్పిన 'ఆర్.ఆర్.ఆర్'.. 2021 సంక్రాంతికి, ఆ తర్వాత దసరాకు పోస్ట్ పోన్ అయింది. ఈసారి కరోనా రూపంలో ఈ చిత్రానికి ఇబ్బందులు వచ్చాయి.

'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయింది. అనుమతులు వచ్చిన వెంటనే తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయినప్పటికీ ముందుగా ప్రకటించినట్లుగా అక్టోబర్ 13న వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులోనూ ఇతర భాషలలో విడుదలయ్యే సినిమా కావడంతో అక్కడి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. RRR రిలీజ్ డేట్ వస్తే దానికి తగ్గట్టుగా ప్రమోషన్లు మరియు ఇతర ఆర్థిక విషయాలను ప్లాన్ చేసుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్స్ ఎదురుచూస్తునన్నారు.

అయితే రాజమౌళి మాత్రం 'ఆర్.ఆర్.ఆర్' విడుదల తేదీ విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్‍ మార్చడంతో మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని రాజమౌళి భావిస్తున్నారట. జూలై నుంచి థియేటర్లు కూడా రీ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటంతో.. ఇప్పుడు జక్కన్న పై ఒత్తిడి పెరగనుంది. అందుకే సిచ్యుయేషన్ ని బట్టి జూలైలో 'RRR' విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని ఆయన నిర్ణయించారట. మరి ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేస్తారా లేదా వచ్చే ఏడాదికి వాయిదా వేస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News