ఎన్టీఆర్ లాంటి ఐకానిక్, లెజెండ్ తో వర్క్ చేయడం నా డ్రీమ్: జాన్వీ

Update: 2022-11-02 16:10 GMT
సినీ అభిమానులు అతిలోక సుందరిగా పిలుచుకునే అలనాటి నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బాగా కష్టపడుతోంది. ఇందులో భాగంగా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ''మిలీ'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ''మిలీ'' చిత్రానికి మత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. ఈ సర్వైవర్‌ థ్రిల్లర్‌ నవంవర్ 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ మరియు బోనీ కపూర్ బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం గురించి విలేఖరులు అడిగిన దానికి జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ''నేను ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడు మళ్ళీ చెబుతాను. ఎన్టీఆర్ సార్‌ తో పనిచేయాలని ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి లెజెండ్.. అలాంటి ఐకాన్ యాక్టర్ తో కలిసి పనిచేయడం ఒక డ్రీమ్'' అని తెలిపింది.

సౌత్ ఇండస్ట్రీ మా అమ్మ శ్రీదేవి మరియు నాన్న బోనీకపూర్‌ పై చాలా ప్రేమను చూపించింది. అలాంటి దక్షిణాది చిత్ర పరిశ్రమలో పనిచేయాలనేది నా కోరిక అని జాన్వీ చెప్పింది. డైరెక్ట్ తెలుగు సినిమాలో ఎప్పుడు నటించబోతున్నారు? అని అడగ్గా.. త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
 
ఇక ''మిలీ'' సినిమా విషయానికొస్తే.. ఇది మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ‘హెలెన్‌’ కు రీమేక్‌ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇందులో సన్నీ కౌశల్ మరియు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.

ఒక షాపింగ్ మాల్ లో పార్ట్‌ టైం జాబ్‌ చేసుకునే ఓ అమ్మాయి.. అనుకోకుండా ఫ్రీజర్‌ రూమ్‌ లో చిక్కుకొనిపోతే.. అక్కడి బయట పడటానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియని తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? చివరకు ఆమె సర్వైవ్ అయిందా లేదా? ఆసక్తికరమైన అంశాలతో 'మిలీ' సినిమా రూపొందింది.

మలయాళంలో ప్రధాన పాత్రలో నటించిన అన్నాబెన్‌ కు ఉత్తమ నటిగా కేరళ స్టేట్‌ అవార్డు వచ్చింది. అలాంటి ఛాలెంజింగ్ రోల్ లో ఇప్పుడు జాన్వీ కపూర్ నటించింది. దీని కోసం మైనస్ 8 నుంచి మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న రియల్ ఫ్రీజర్‌ లో షూటింగ్ చేసిందని తెలుస్తోంది. అంత కష్టపడి చేసిన 'మిలీ' సినిమా జాన్వీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News