జనవరి బాక్సాఫీస్ రివ్యూ: ఒక్క హిట్టు.. మిగతావన్నీ ఫట్టు..!

Update: 2022-02-01 16:38 GMT
టాలీవుడ్ లో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. నూతనోత్సాహంతో కొత్త ఏడాదిలో సరికొత్త విజయాలను అందుకోవాలని.. 2022 ను ఘనంగా ప్రారంభించాలని అనుకున్నారు. అయితే జనవరి నెలలో చిత్ర సీమకు ఆశాజనకంగా లేదు. బాక్సాఫీస్ వద్ద ఒకే ఒక్క సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోగా.. మిగతావన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి మొదటి వారంలో వరుణ్ సందేశ్ 'ఇందువ‌ద‌న‌' - ఆర్జీవీ 'ఆశ ఎన్ కౌంట‌ర్‌' సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇదే క్రమంలో వచ్చిన రానా '1945' - ఆది సాయికుమార్ 'అతిథి దేవోభవ' - శివాజీ రాజా తనయుడి 'వేయి శుభములు కలుగు నీకు' వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయాయి.

ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలను విడుదల చేస్తున్నట్లు హడావుడి జరిగినా.. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో చివరకు 'బంగార్రాజు' వంటి ఒక్క క్రేజీ మూవీ మాత్రమే బరిలో నిలిచింది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన ఈ సీక్వెల్ సినిమా ఫెస్టివల్ సీజన్ ని బాగా క్యాష్ చేసుకుంది. ఈ క్రమంలో జనవరి నెలలో ఏకైక బ్లాక్ బస్టర్ గా బంగార్రాజు నిలిచింది.

ఇక పండుగకు విడుదలైన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియలేదు. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన ఆశిష్ 'రౌడీ బాయ్స్' ఆకట్టుకోలేకపోయింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేసిన 'హీరో' సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

సంక్రాంతి తరువాత 'ఉనికి' 'వధు కట్నం' వంటి చిన్న సినిమాలు వచ్చాయి కానీ జనాలు వీటి కోసం థియేటర్లకు వెళ్ళడానికి ఆసక్తి కనబరచలేదు. ఇక నెలాఖరున కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా బ్యాడ్ లక్ మిగిలిచింది. తొలి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా జనవరి నెలను డిజాస్టర్ తో ముగించింది.

క‌రోనా థర్డ్ వేవ్ ప్రభావం.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌నలు ఉన్నా జనాలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించారనడానికి 'బంగార్రాజు' వసూల్లే నిద‌ర్శ‌నం. డిసెంబర్ లో వచ్చిన 'అఖండ' 'పుష్ప' 'శ్యామ్ సింగరాయ్' సినిమాలకు సంక్రాంతి సీజన్ లోనూ ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి జనవరి నెలలో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టగా.. కంటెంట్ లేని సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయని అర్థం అవుతోంది.

ఫిబ్రవరి నెలలో పలు క్రేజీ సినిమాలు విడుదల అవుతుండటం టాలీవుడ్ కు కలిసొచ్చే అంశం. 'సామాన్యుడు' 'ఖిలాడీ' 'FIR' 'డీజే టిల్లు' 'శేఖ‌ర్‌' 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' కోసం లాక్ చేసిన రెండు తేదీల్లో ఫిబ్రవరి 25 కూడా ఉందనే సంగతి తెలిసిందే. మరి వచ్చే నెల బాక్సాఫీస్ కు కళ తిరిగిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News