మూవీ రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

Update: 2016-11-25 09:33 GMT
చిత్రం: ‘జయమ్ము నిశ్చయమ్మురా’

నటీనటులు: శ్రీనివాసరెడ్డి - పూర్ణ - రవి వర్మ - శ్రీ విష్ణు - కృష్ణ భగవాన్ - ప్రవీణ్ - పోసాని కృష్ణమురళి - ప్రభాస్ శీను - రఘు కారుమంచి - జోగి బ్రదర్స్ తదితరులు
సంగీతం: రవిచంద్ర
నేపథ్య సంగీతం: కార్తీక్ రాడ్రిగెజ్
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
స్క్రీన్ ప్లే: శివరాజ్ కనుమూరి - పరమ్
నిర్మాతలు: శివరాజ్ కనుమూరి - సతీష్ కనుమూరి
రచన - దర్శకత్వం: శివరాజ్ కనుమూరి

‘గీతాంజలి’ సినిమాలో హీరో కాని హీరో పాత్ర చేశాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. ఈసారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో పూర్తి స్థాయి హీరోగా మారాడు. కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో జనాల్లో బాగానే క్యూరియాసిటీ కలిగించింది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సర్వేష్ అలియాస్ సర్వమంగళం (శ్రీనివాసరెడ్డి) కరీంనగర్లో ఓ పేద చేనేత కుటుంబానికి చెందిన కుర్రాడు. పీజీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అతడికి ఆత్మవిశ్వాసం బాగా తక్కువ. జాతకాల పిచ్చి బాగా ఉంటుంది. తన గురువు చెప్పినట్లు చాదస్తంగా నడుచుకుంటుంటాడు. తనకు గ్రూప్-2లో ఉద్యోగం వస్తే అది కూడా గురువు పుణ్యమే అనుకుంటాడు. అతడి తొలి పోస్టింగ్ కాకినాడలో వస్తుంది. ఐతే ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న తల్లి కోసం సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయించుకుని రావాలనుకుంటాడు. తన ఆఫీస్ పక్కనే ‘మీసేవ’లో పని చేసే రాణి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బదిలీ అవుతుందన్న గురువు మాటను నమ్మి తనను మెప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు సర్వమంగళం. మరి అతడి ప్రయత్నాలు ఫలించాయా.. రాణి అతణ్ని ప్రేమించిందా లేదా.. అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

తెలుగులో నేటివిటీ ఉన్న సినిమాలు ఈ మధ్య బాగా అరుదైపోయాయి. ఇలాంటి సమయంలో ‘దేశవాళీ వినోదం’ అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ దానికి న్యాయం చేసింది. తెలివితేటలు.. ధైర్యం అన్నీ ఉన్నా.. ఆత్మవిశ్వాసం లేని కుర్రాడు తనకు తాను విధించుకున్న బంధనాల్ని తెంచుకుని జీవితంలో ఎలా విజయం సాధించాడనే కథాంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి. ఓవరాల్ గా కథ చెప్పుకుంటే ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం లాగా ఉంటుంది. దర్శకుడు దీన్ని సాధ్యమైనంత వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాడు కానీ.. నరేషన్ స్లో కావడం వల్ల.. అక్కడక్కడా సాగతీత వల్ల.. నిడివి ఎక్కువవడం వల్ల బోర్ కొట్టిస్తుంది. కానీ ఓవరాల్ గా ఇది ఒక మంచి ప్రయత్నం.

‘జయమ్ము నిశ్చయమ్మురా’ కథను రెండు భాగాలుగా చేసుకున్నాడు దర్శకుడు. ప్రథమార్ధమంతా సమస్యను లేవనెత్తాడు. ద్వితీయార్ధంలో పరిష్కారం చూపించాడు. సమస్య అన్నాక ఇబ్బందిగా ఉంటుంది. పరిష్కారం అన్నాక ఆటోమేటిగ్గా ఉత్సాహం వస్తుంది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చూస్తున్నపుడు ప్రేక్షకులకు ఇలాంటి ఫీలింగే కలగొచ్చు. హీరో పాత్ర పరిచయంతోనే సినిమా ఎలా సాగబోతోందన్న దానిపై ప్రేక్షకుడికి ఒక అవగాహన వచ్చేస్తుంది. జాతకాల పిచ్చితో.. చాదస్తంతో హీరో ఇబ్బందులు కొని తెచ్చుకోబోతున్నాడని అర్థమవుతుంది. ఐతే హీరోకు చిక్కుముడి వేయడానికి దర్శకుడు బాగా సమయం తీసుకున్నాడు.

సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు విషయం ఉన్న పాత్రలు చాలానే ఉన్నాయి. ప్రతి పాత్రకూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ పాత్రలన్నీ ఒక్కొక్కటే పరిచయమవుతుంటే బాగానే టైంపాస్ అవుతుంది కానీ.. ఈ పరిచయాలయ్యాకే కథ ముందుకు నడవదు. కథ ఎప్పుడు మలుపు తీసుకుంటుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ దశలో ప్రేక్షకుడికి అసహనం కలుగుతుంది. మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్లు పేలినా.. రిపీటెడ్ గా సాగే కొన్ని సన్నివేశాలు విసిగిస్తాయి. ఇంటర్వెల్ మలుపు అంత ఊహించలేనిదేమీ కాదు.

ఐతే ద్వితీయార్ధంలో హీరో ఆత్మవిశ్వాసం పుంజుకున్నాక ప్రేక్షకుడిలోనూ ఉత్సాహం వస్తుంది. తన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్లే తీరు ఆకట్టుకుంటుంది. మరోవైపు కృష్ణభగవాన్.. ప్రభాస్ శ్రీను.. ప్రవీణ్.. పోసాని పాత్రలతో పండించిన వినోదం కూడా బాగానే టైంపాస్ చేయిస్తుంది. దీంతో కథ చకచకా ముందుకు సాగిపోతుంది. ప్రేమకథకు ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకుంటుంది. ఐతే సినిమా ముగియాల్సిన దశలో దర్శకుడు మళ్లీ కొంచెం సాగదీశాడు. ‘అలా మొదలైంది’ తరహాలో పెళ్లిలో కన్ఫ్యూజింగ్ కామెడీతో సినిమాను వినోదాత్మకంగా ముగించాలని చూసి.. ప్రేక్షకుల్ని ఇంకొంత సమయం థియేటర్లో కూర్చోబెట్టాడు. చివరికి నవ్వు ముఖంతో.. ఒక పాజిటివ్ ఫీలింగ్ తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వస్తాడు.

‘జయమ్ము నిశ్చయమ్మురా’లో నేటివిటీ ఫ్యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అటు కరీం నగర్.. ఇటు కాకినాడ ప్రాంతాల్ని.. అక్కడి మనుషుల్ని చూపించిన తీరు.. వాళ్లకు రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్లవే కాకుండా.. ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్లను కూడా బలంగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్రా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రేక్షకుడికి గుర్తుండి పోతుంది. దేశవాళీ వినోదం అన్నది పేరుకు మాత్రమే కాదు.. సినిమా అంతటా అదే ఫీల్ తోనే సాగుతుంది. ఒకప్పటి రోజుల్ని గుర్తుకు తెస్తుంది. కృష్ణభగవాన్ పాత్రతో పండించిన ‘మంగవారం’ వినోదం అడల్ట్ కామెడీ ప్రియుల్ని అలరించొచ్చు. అదొక్కటి మినహాయిస్తే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనరే. కథాకథనాల్లో కొత్తదనం లేదు కానీ.. ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. నరేషన్ స్లోగా ఉండటం.. ప్రథమార్ధంలో సాగతీత ‘జయమ్ము నిశ్చయమ్మురా’కు ప్రధానమైన బలహీనతలు. దీని వల్ల ముందు జయం నిశ్చయమేనా అని సందేహాలు కలుగుతాయి కానీ.. కొంచెం నెమ్మదిగా అయినా.. చివరికి వచ్చేసరికి ‘జయమ్ము నిశ్చయమ్మే’ అనిపిస్తుంది.

నటీనటులు:

కమెడియన్ గా చిన్న పాత్ర చేసినా తన ప్రత్యేకత చాటుకునే శ్రీనివాసరెడ్డి.. ఇందులో పూర్తి సినిమాను అతను తన భుజాల మీద మోయగలనని చూపించాడు. అతను ‘హీరో’ వేషాలేమీ వేయకుండా పద్ధతిగా నటించాడు. అతడి పాత్రను కూడా బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు శివరాజ్. సినిమాలో ఎక్కడా శ్రీనివాసరెడ్డి కనిపించడు. సర్వమంగళం పాత్ర కనిపిస్తుంది. అతడి పాత్ర.. నటన అంత సహజంగా బాగా కుదిరాయి. పాత్రకు తగ్గట్లుగా అంత బాగా నటించాడతను. తెలంగాణ యాసలో డైలాగులు కూడా బాగా చెప్పాడతను. పూర్ణ కూడా బాగానే నటించింది. శ్రీనివాసరెడ్డి పక్కన ఆమె సూటయింది. ఐతే ఆమెలో మునుపటి గ్లో లేదు. డల్లుగా కనిపించింది. సినిమా మరిన్ని గుర్తుండే పాత్రలున్నాయి. రవివర్మ నెగెటివ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు. శ్రీవిష్ణు పాత్ర భలే ఫన్నీగా సాగుతుంది. ప్రవీణ్-పోసాని కాంబినేషన్లో సీన్లు పండాయి. కృష్ణభగవాన్ పాత్రతో అడల్ట్ కామెడీ పండించారు. జోగి బ్రదర్స్ కూడా బాగానే చేశారు. ప్రభాస్ శీను కూడా నవ్వించాడు.

సాంకేతికవర్గం:

‘జయమ్ము నిశ్చయమ్మురా’కు సాంకేతిక హంగులు కూడా బాగానే కుదిరాయి. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ నగేష్ బానెల్ మరోసారి తన కెమెరా పనితనం చూపించాడు. సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. రవిచంద్ర పాటలు.. సందర్భోచితంగా ఉన్నాయి. సినిమాలో చక్కగా ఇమిడిపోయాయి. అన్నింట్లోకి ఓ రంగుల చిలకా.. ఆకట్టుకుంటుంది. పరమ్ నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. నిర్మాణ విలువలు ఓకే. రైటర్ కమ్ డైరెక్టర్ శివరాజ్ కనుమూరి.. తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. అతను నిజాయితీగా ఒక ప్రయత్నం చేశాడు. కొత్త దర్శకుడైనా నటీనటలు.. సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడమే కాక.. సినిమాలో తన ముద్రను చూపించాడు. రచన అతడి ప్రధాన బలం. మంచి కథ రాసుకున్నాడు. బలమైన పాత్రల్నీ తీర్చిదిద్దాడు. తెలిసిన కథనే చక్కటి పాత్రల ద్వారా ఎఫెక్టివ్ గా చెప్పాడు. కాకపోతే అతడి నరేషన్ మరీ స్లో. పాత్రల డీటైలింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుని.. కొన్ని అనవసర సన్నివేశాలు పెట్టి సినిమాను సాగదీశాడు. ఓవరాల్ గా దర్శకుడిగా శివరాజ్ కు మంచి మార్కులే పడతాయి.

చివరగా: జయమ్ము నిశ్చయమ్మే.. కొంచెం నెమ్మదిగా!

రేటింగ్: 2.75/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News