ధఢక్ వేగంగా కొట్టుకుంటోంది

Update: 2018-07-04 10:30 GMT
స్టార్ హీరోల వారసులు తెరంగేట్రం చేసినప్పుడు బయటికి కనిపించని ఒత్తిడి చాలా ఉంటుంది. అభిమానులు మొదలుకుని సాధారణ ప్రేక్షకుల దాకా పోలికలు గుర్తుచేసుకుని మరీ వీళ్ళ సినిమాలు చూస్తారు కనక సహజంగానే అది ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇదే స్థితిలో ఉంది. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న మొదటి సినిమా ధఢక్ కోసం కపూర్ కుటుంబమే కాదు అతిలోకసుందరి అశేష అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అదే ఇప్పుడు జాన్వీని టెన్షన్ కు గురి చేస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా తనను మామూలు కొత్త హీరోయిన్ లాగే చూడమని యూనిట్ కు చెప్పానని అలా కాకుండా శ్రీదేవి కూతురిలా తనను చూస్తే మాత్రం సహజంగా నటించలేనని చెప్పిందట. అందులో నిజం లేకపోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ప్రత్యేక దృష్టితో చూడటం మొదలు పెడితే కెమెరా ముందు నటించడం చాలా కష్టం.

ధఢక్ తో గొప్ప నటి అనిపించుకునే కోరిక లేదని కేవలం పాస్ మార్కులు వస్తే చాలానే ఉద్దేశంలో ఉన్నానంటున్న జాన్వీ కపూర్ ప్రతి పాటకు ఒకటికి రెండు సార్లు డాన్స్ రిహార్సల్ చేసిందట. అది చాలా హెల్ప్ అయ్యిందని చెబుతోంది. మరాఠి బ్లాక్ బస్టర్ సైరాత్ కు రీమేక్ గా రూపొందిన దఢక్ లో బలమైన సామాజిక  నేపథ్యం ఉన్న ఒక రాజకీయ నాయకుడి కూతురిగా జాన్వీ నటించింది. వెనుకబడిన వర్గాలకు చెందిన కుర్రాడితో ప్రేమలో పడి ముంబై పారిపోయి వచ్చి రహస్యంగా పెళ్లి చేసుకునే కథలో చాలా మలుపులు ఉంటాయి. ఇప్పటికే హీరో ఇషాన్ ఖట్టర్ తో జాన్వీ కపూర్ కెమిస్ట్రీ సూపర్ గా ఉందని ట్రైలర్ చూసినవాళ్లు చెబుతున్నారు. జులై 20న విడుదల కానున్న దఢక్ స్పెషల్ ప్రీమియర్లు వచ్చే వారం వేయబోతున్నారు. దఢక్ విడుదల కాకుండానే జాన్వీకి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. కానీ ఫలితం చూసాకే ఎలాంటి కథలు ఎంచుకోవాలో నిర్ణయం తీసుకుంటుందట జాన్వీ.
Tags:    

Similar News