క్రేజ్ లేదన్నారు.. శాటిలైటే 75 కోట్లు

Update: 2018-04-26 09:41 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే దాని లెక్కలే వేరుగా ఉంటాయి. రజినీ రియల్ గా కాకుండా యానిమేషన్ రూపంలో కనిపించిన ‘కోచ్చడయాన్’కు కూడా వంద కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు చెప్పుకున్నారు. దానికి కూడా భారీగానే బిజినెస్ జరిగింది. ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. అయినప్పటికీ దీని తర్వాత వచ్చిన ‘లింగ’కు మంచి క్రేజ్ వచ్చింది. అది కూడా డిజాస్టరే. అయినా ‘కబాలి’కి విపరీతమైన హైప్ వచ్చింది. దాని ఫలితం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ తో రజనీ మళ్లీ ఓ సినిమా చేశాడు. అదే.. కాలా. దీనికి కూడా ముందు అంత క్రేజ్ లేదు. కానీ రిలీజ్ టైం దగ్గర పడేసరికి కథ మారిపోయింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు అన్ని భాషలకూ కలిపి ఏకంగా రూ.75 కోట్లు పలకడం విశేషం. దీన్ని బట్టే చెప్పేయొచ్చు రజనీ రేంజ్ వేరని. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ మామూలుది కాదని.

స్టార్ గ్రూప్ సంస్థ ‘కాలా’ శాటిలైట్ హక్కుల్ని అన్ని భాషలకూ కలిపి హోల్ సేల్‌ గా కొనేసింది. తమిళంలో స్టార్ విజయ్.. తెలుగులో స్టార్ మా.. హిందీలో స్టార్ గోల్డ్ ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేయబోతున్నాయి. మొత్తంగా ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. రజనీ అల్లుడు ధనుషే ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసేంద. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ‘కాలా’ ఏప్రిల్ 27నే రావాల్సింది. కానీ కోలీవుడ్ లో  సమ్మె కారణంగా వాయిదా పడింది. జూన్ 7కు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. రజినీ సరసన హ్యూమా ఖురేషి నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నానా పటేకర్ విలన్ పాత్ర పోషించాడు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ముంబయిలో ఓ మురికివాడ నుంచి డాన్ స్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి కథ ఇది. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.


Tags:    

Similar News