మెగా అల్లుడిపై అంచనాలు తగ్గిస్తున్నారెందుకో?

Update: 2018-05-27 04:28 GMT
ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు వేరే కుటుంబాల నుంచి వచ్చి హీరోలకు అల్లుళ్లయ్యే వాళ్లు కూడా హీరోలైపోతున్నారు. ఈ కోవలో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కథానాయకుడిగా మారాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తెరంగేట్రం చేసేస్తున్నాడు. శ్రీజను పెళ్లి చేసుకున్నప్పుడు అతడి ఫొటోలు చూస్తేనే చాలామంది ఇతను హీరో అవుతాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అంచనాలకు తగ్గట్లే కొన్ని నెలల కిందట కళ్యాణ్ తొలి సినిమా శ్రీకారం చుట్టుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి నిర్మాణంలో రాకేశ్ శశి అనే యువ దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి ‘విజేత’ అనే చిరంజీవి క్లాసిక్ సినిమా టైటిల్‌ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ నిన్ననే విడుదల చేశారు. టైటిల్‌‌ కు తగ్గట్లుగా లేదీ ఫస్ట్ లుక్. కళ్యాణ్ దేవ్ డల్లుగా.. సాధారణంగా కనిపించాడు. అతడి బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉంది. ఆత్మవిశ్వాసం కనిపించలేదు. భుజాలు వదులు చేసి డల్లుగా నిలుచున్నాడతను. ముఖంలో కూడా ఏ భావాలు చూపించలేదు. జస్ట్ ఒక చిరునవ్వు నవ్వాడంతే. ఈ ఫస్ట్ లుక్ విషయంలో ఆశించినంత సానుకూల స్పందన రాలేదు. కళ్యాణ్ దేవ్ కు ఊరికే బిల్డప్ ఇవ్వడం ఎందుకని.. జనాలకు అతడిపై ఏ అంచనాలు లేకుండా ఉంటే మంచిదని.. లేకుంటే ఒత్తిడిలో పడతాడని ఏమైనా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి సాదా సీదా ఫస్ట్ లుక్ వదిలారా అన్న సందేహాలు కలుగుతున్నాయి జనాలకు. బహుశా ఇందులో హీరోయిజం ఏమీ లేకుండా కథతో పాటు సాగిపోయే క్యారెక్టర్ అయి ఉండొచ్చు కళ్యాణ్ ది. సాయి కొర్రపాటి లాంటి అభిరుచి ఉన్న నిర్మాత ఉన్నాడు కాబట్టి సినిమా ఆ తరహాలోనే ఉన్నా ఉండొచ్చు.  జులైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News