స్టార్‌ డైరెక్టర్స్‌ డాటర్స్‌ కి పని అవ్వడం లేదు

Update: 2022-08-17 15:30 GMT
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్‌ విషయం అయ్యింది. అయితే వారసుల్లో ఎక్కువ శాతం హీరోలు మాత్రమే ఉంటున్నారు. నార్త్‌ లో హీరోయిన్స్ కూడా వారసులే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే సౌత్ లో కూడా హీరోయిన్స్ గా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుల అమ్మాయిలు హీరోయిన్స్ గా పరిచయం అవ్వడం చూస్తూ ఉన్నాం. కొన్నాళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిరాశ పర్చిన విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలంగా స్ట్రగుల్‌ పడుతూ ఉంటే ఎట్టకేలకు ఆమెకు ఒక సక్సెస్‌ దక్కింది. తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌ కూతురు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లెజెండ్రీ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీ హీరోగా నటించిన విరుమన్‌ సినిమా ద్వారా అదితి శంకర్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంగా ఎదురు చూసిన విరుమన్ సినిమా నిరాశ పరిచింది.

సినిమాలోని అదితి పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేదు. అసలు ఇలాంటి సినిమాలో.. పాత్రలో ఆమె ఎలా నటించింది అంటూ తమిళ మీడియా సర్కిల్స్ లో చర్చలు వినిపిస్తున్నాయి. తండ్రి శంకర్‌ వారిస్తున్నా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అదితి కి తీవ్ర నిరాశ తప్పలేదు. ముందు ముందు మళ్లీ ఈమె సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

హీరోలు మరియు హీరోయిన్స్ నట వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోలుగా సక్సెస్ లు అయిన వారు ఉన్నారు. కాని అతి తక్కువ మంది హీరోయిన్స్‌ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లో శృతి హాసన్‌ పర్వాలేదు అన్నట్లుగా కెరీర్‌ లో ముందుకు సాగుతుంది.

మరో వైపు వరలక్ష్మి కూడా నటిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటుంది. కాని ఈ స్టార్‌ డైరెక్టర్స్ కూతుర్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డారు. ముందు ముందు మరెంత మంది స్టార్ కిడ్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ అవుతారు.. వారిలో ఎంత మంది సక్సెస్ ను దక్కించుకుంటారు అనేది చూడాలి.
Tags:    

Similar News