లోకనాయకుడు సినీ ప్రస్థానానికి 61 ఏళ్ళు...!

Update: 2020-08-12 17:31 GMT
లోకనాయకుడు కమల్ హాసన్ నటుడిగా 61 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆరేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టారు కమల్ హాసన్. 1960 ఆగస్టు 12న విడుదలైన 'కలాతూర్ కన్నమ్మ' చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన కమల్.. ఆరు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కన్యాకుమారి' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన కమల్.. బాషా బేధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ లోకనాయకుడు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ తన నటనతో కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా దేశంవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు.

ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ.. ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పిస్తూ వచ్చారు. 'అంతులేని కథ' 'ఇది కథ కాదు' 'మరో చరిత్ర' 'ఆకలి రాజ్యం' 'భామనే సత్య భామనే' 'పుష్పక విమానం' 'ఇంద్రుడు చంద్రుడు' 'స్వాతి ముత్యం' 'సాగర సంగమం' 'శుభ సంకల్పం' 'భారతీయుడు' 'దశావతారం' 'విశ్వరూపం' ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోమరెన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు కమల్. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తూ తన నటనతో కట్టిపడేస్తారు. సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదని అది జీవితం అని నమ్మే కమల్ హాసన్.. సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ నేర్చుకున్నారు. కమల్ నటుడిగానే కాకుండా డ్యాన్సర్ గా రచయితగా సింగర్ గా నిర్మాతగా దర్శకుడిగా అనేక పాత్రలు పోషించారు.

ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుండే కమల్ హాసన్ ని భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' 'పద్మభూషణ్' లతో సత్కరించింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ పార్టీ స్థాపించి తనదైన శైలిలో ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో కూడా విలక్షణ నటుడు కమల్ హాసన్ తన వంతు బాధ్యతగా ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా మారి తాను చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రస్తుతం 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్న కమల్ హాసన్ మరెన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం..!
Tags:    

Similar News