'హిట్లర్' విలన్ వైద్యానికి సాయం చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్...!

Update: 2020-07-10 12:10 GMT
ప్ర‌ముఖ న‌టుడు, స్టంట్ మ్యాన్ పొన్నంబ‌ళ‌మ్ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ పడుతున్న పొన్నంబ‌ళ‌మ్ చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న పొన్నంబ‌ళ‌మ్ తీసిన ఓ సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో అత‌ను ఆక్సిజ‌న్ మాస్క్‌ తోనే ఊపిరి పీల్చుకుంటున్నారు. దీంతో అత‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సినీ అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా ఈ విష‌యం తెలుసుకున్న స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ అత‌నికి ఆర్థిక చేయూత అందించడానికి ముందుకొచ్చారు. ఫోన్‌ లో అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకుని డ‌బ్బు సాయం చేస్తాన‌ని.. అంతేకాకుండా అత‌ని పిల్ల‌ల‌ను చ‌దివించే బాధ్య‌త‌ను తీసుకుంటానని మాటిచ్చారు. పొన్నంబ‌ళ‌మ్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి క‌మ‌ల్ హాస‌న్ టీమ్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

కాగా పొన్నంబ‌ళ‌మ్ స్టంట్‌ మ్యాన్ గా విలన్ గా సహాయ నటుడిగా తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. క‌మ‌ల్ హాస‌న్‌ తో క‌లిసి 'అపూర్వ సోదరులు' 'మైకేల్ మ‌ద‌న కామ‌రాజు' వంటి చిత్రాల్లో న‌టించారు. వీటితో పాటు ర‌జినీకాంత్ 'ముత్తు' 'అరుణాచ‌లం' వంటి చిత్రాల్లో విలన్ గా కనిపించారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎక్కువగా నటించారు. 'ఘరానా మొగుడు' 'మెకానిక్ అల్లుడు' 'ముగ్గురు మొనగాళ్లు' 'హిట్లర్' 'అల్లరి ప్రియుడు' 'పవిత్ర ప్రేమ' 'నువ్వొస్తావని' 'చూసొద్దాం రండి' 'ఎదురులేని మనిషి' 'పల్నాటి బ్రహ్మనాయుడు' 'పెదబాబు' 'గుడుంబా శంకర్' 'వీరభద్ర' 'బుజ్జిగాడు' వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ఇక కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొన్నారు. పొన్నంబ‌ళ‌మ్ చివ‌రిసారిగా 2019లో రిలీజైన‌ 'కోమ‌లి' సినిమాలో న‌టించారు.
Tags:    

Similar News