బాహుబ‌లి స్ఫూర్తితో మ‌రొక‌టి

Update: 2018-12-25 11:28 GMT
దాదాపు 2000 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో చెర‌గ‌ని ముద్ర వేసింది బాహుబ‌లి సిరీస్. పార్ట్- 1, పార్ట్ -2 క‌లిపి ఏకంగా 2600 కోట్లు వ‌సూలు చేశాయి. ఈ విజ‌యాన్ని దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీవిశ్లేష‌కులు వేనోళ్ల కొనియాడారు. క‌ర‌ణ్ జోహార్ అంత‌టి వాడు ఉత్త‌రాదిన‌ రిలీజ్ చేసి భారీగా లాభాలు దండుకున్నాడు. ఆ క‌రెన్సీ వాస‌న క‌ర‌ణ్ ని వ‌దిలి పోవ‌డం లేదు. అందుకే ఇప్పుడు ఓ బృహ‌త్త‌ర‌మైన ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టాడు. చ‌రిత్ర‌ను త‌వ్వితే దొర‌క‌ని కథ ఉంటుందా? అందుకే ఒక‌సారి హిస్ట‌రీలోకి వెళ్లి అక్క‌డ గొప్ప ఎమోష‌న్ కి ఆస్కారం ఉన్న అసాధార‌ణ‌ ఘ‌ట్టాన్ని ఎంపిక చేసుకుని సినిమాగా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే `త‌ఖ్త్` అనే టైటిల్ ని ప్ర‌క‌టించాడు. ఈ సినిమాలో న‌టించే కాస్టింగ్ ని ఎంపిక చేసుకుని త‌ర్ఫీదునిస్తున్నాడు. ర‌ణ‌వీర్ సింగ్, విక్కీ కౌశ‌ల్, క‌రీనా క‌పూర్, ఆలియాభ‌ట్, జాన్వీ క‌పూర్, భూమి పెడ్నేక‌ర్ వంటి భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

భార‌త‌దేశంలో మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. పూర్తిగా బాహుబ‌లి స్ఫూర్తితో చేస్తున్న ప్ర‌య‌త్న‌మిద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలోనూ రాజులు- రాణులు ఉంటారు. రాజ్యాలు ఉంటాయి. దండ‌యాత్ర‌లు, భీక‌ర‌మైన‌ యుద్ధాలుంటాయి. క‌త్తియుద్ధాలు, గుర్ర‌పు స్వారీలు, ర‌క్త‌పాతం, ఎమోష‌న్ అన్నిటికీ ఆస్కారం ఉంది. త‌ఖ్త్ అంటే కుర్చీ (సింహాస‌నం). దానికోసం త‌గువులాడుకునే సోద‌రుల క‌థ‌తోనే ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికి కొన్ని పాత్ర‌ల పేర్లు లీక‌య్యాయి. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ ధారా శిఖో అనే వీరుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. న‌వ‌త‌రం హీరో విక్కీ కౌశ‌ల్ మొఘ‌ల్ సామ్రాజ్య‌పు చిట్ట‌చివ‌రి రాజు  ఔరంగ‌జేబ్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఈ రెండు పాత్ర‌ల్ని ఇప్ప‌టికి రివీల్ చేశారు. అంటే ఇది మొఘ‌ల్ సామ్రాజ్య క‌థ అని క్లారిటీ వ‌చ్చేసింది. క‌ర‌ణ్ జోహార్ స్వ‌యంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతోంది. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని కొత్త సంవ‌త్స‌రంలో క‌ర‌ణ్ రివీల్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `ప‌ద్మావ‌త్ 3డి` గొప్ప విజ‌యం సాధించింది. రాజ్‌పుత్‌ ల చ‌రిత్ర‌ను భ‌న్సాలీ ఒక అంద‌మైన దృశ్య‌కావ్యంలా మ‌లిచారు. ప‌ద్మావ‌త్ ఎన్నో వివాదాల న‌డుమ రిలీజై ఏకంగా 600కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. దీనిని బ‌ట్టి.. త‌ఖ్త్ కంటే ముందే మూడు భారీ చిత్రాలు అసాధార‌ణ విజ‌యం సాధించాయి కాబ‌ట్టి క‌ర‌ణ్ ముందు అతి పెద్ద స‌వాల్ ఉంద‌ని చెప్పాలి. బాహుబ‌లి సిరీస్, ప‌ద్మావ‌త్ సాధించిన వ‌సూళ్ల‌ను ఆ త‌ర్వాత వేరొక హిస్టారిక‌ల్ సినిమా ఏదీ ట‌చ్ చేయ‌లేదు. య‌శ్‌రాజ్ ఫిలింస్ రూపొందించిన భారీ చిత్రం `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోవ‌డంతో అదో మేలుకొలుపుగానే ప‌రిశ్ర‌మ‌కు క‌నిపిస్తోంది. అందుకే తాజా భారీ హిస్టారిక‌ల్ ఎపిక్ ని క‌ర‌ణ్ ఎంతో జాగ్ర‌త్త‌గానే రూపొందిస్తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News