ప్రచారం లేకుండానే సినిమాను రిలీజ్ చేస్తున్నారే!

Update: 2019-12-19 05:00 GMT
ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా కారణాలు ఉంటాయి. ప్రేక్షకులను మెప్పించే కథా కథనాలు.. పాటలు.. స్టార్ హీరోలు.. రిలీజ్ టైమింగ్ లంటి అంశాలు చాలానే ఉంటాయి.  అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక సినిమాకు ప్రేక్షకులను చేరువ చేసేది మాత్రం ప్రచారమే.  అది సంప్రదాయ పద్దతిలో చేసే ప్రచారం అయినా కావొచ్చు.. లేదా ఆధునిక పద్దతుల్లో చేసే సోషల్ మీడియా ప్రచారం అయినా కావొచ్చు. 

అయితే కొందరు ఫిలిం మేకర్స్ మాత్రం ప్రచారం కోసం డబ్బు ఖర్చు పెట్టడం దండగ అనే ఆలోచనలో ఉంటారు. అలాగే ఫిక్స్ అయిపోయి తమ సినిమాకు తమకు తోచిన రీతిలో సినిమాను రిలీజ్ చేస్తారు.  అయితే అందరూ రామ్ గోపాల్ వర్మ తరహాలో పైసా ఖర్చులేకుండా భారీ ప్రచారం చెయ్యలేరు.  అయన రాగం తాళం వేరే.  ఆయన స్టైల్ ఫాలో కావడం చాలా కష్టం. రేపు.. అంటే డిసెంబర్ 20 న నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ సినిమాలు.  నందమూరి బాలకృష్ణ 'రూలర్'.. సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే'.  రెండేమో డబ్బింగ్ సినిమాలు.. సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3'..  కార్తి 'దొంగ'. 

ఈ నాలుగు సినిమాలలో మూడు సినిమాల కు ఏదో ఒక రూపంలో ప్రచారం సాగుతోంది కానీ కార్తి 'దొంగ' సినిమా సందడి మాత్రం లేనే లేదు.  కార్తి ఈమధ్యే 'ఖైది' సినిమాతో హిట్ సాధించాడు. కలెక్షన్స్ మాత్రమే కాకుండా సినిమాకు మంచి పేరు కూడా వచ్చింది.  ఇల్లాంటి సినిమా తర్వాత కార్తి సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం సందడి ఉండాలి కదా. అది కూడా కనిపించడం లేదు.  'దొంగ' సినిమా రిలీజ్ చేస్తున్న నిర్మాతలు ఇవేవీ పట్టించుకోవడం లేదట.  కార్తి కూడా ఈ విషయం గ్రహించి నిర్మాతలను కనీసం అవుట్ డోర్ పబ్లిసిటీ కూడా చేయకపోతే ఎలా అని అడుగుతున్నాడట. టైటిల్ కి తగ్గట్టే ఇలా గుట్టుచప్పుడు కాకుండా వస్తున్న ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

   

Tags:    

Similar News