శ్రీ‌రెడ్డిపై 'మా' ది అరాచ‌క న్యాయం:క‌త్తి మ‌హేష్

Update: 2018-04-11 12:14 GMT
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీ‌రెడ్డి నిర‌స‌న తార‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. లోక‌ల్ మీడియా నుంచి అంత‌ర్జాతీయ మీడియా, సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డి పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రెడ్డి, మా ల వైఖ‌రిపై ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కు శ్రీ‌రెడ్డి త‌న ద‌గ్గ‌ర చాలామంది జాత‌కాలున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేసింద‌ని, దీంతో ఆమె కేవ‌లం ప‌బ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోంద‌ని అంతా అనుకున్నార‌ని మ‌హేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, తాజాగా శ్రీ‌రెడ్డి నిన్న త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టింద‌ని,త‌న‌కు జ‌రిగిన అన్యాయం నిజ‌మేన‌ని వాటిని బ‌ట్టి అంద‌రికీ తెలుస్తోంద‌ని మ‌హేష్ అన్నారు. ఆమె మాట్లాడిన భాష ప‌ట్ల కొంద‌రికి అభ్య‌తరం ఉండొచ్చ‌ని, అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల కొంద‌రికి అభ్యంత‌రం ఉండొచ్చ‌ని...కానీ ఆమె చెప్పిన విష‌యాలు, త‌న‌కు జ‌రిగిన అన్యాయం మాత్రం నిజ‌మ‌ని ఇపుడు అంద‌రికీ అర్థం అయింద‌ని ఆయ‌న అన్నారు.

`మా` కూడా తొంద‌ర‌ప‌డి ఒక ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థలా ఆమెను బాయ్ కాట్ చేసి ఉండాల్సింది కాద‌ని ఆయ‌న అన్నారు. `మా`లో ఎవ‌రిని చేర్చుకోవాలన్న దానిపై `మా`పెద్ద‌ల‌కు పూర్తి అధికారాలున్నాయ‌ని, శ్రీ‌రెడ్డి చేసిన ప‌నిని ఖండించి ఉంటే బాగుండేద‌ని అన్నారు. అయితే, ఆమెతో `మా`లోని 900 మంది స‌భ్యులు ప‌నిచేయ‌కూడ‌ద‌ని చెప్ప‌డం స‌రికాద‌ని, అటువంటి చ‌ర్య‌ల వ‌ల్ల మ‌నం ఏ కాలంలో జీవిస్తున్నామ‌ని సందేహం క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు రావ‌డంలేద‌ని, అవ‌కాశాల పేరుతో త‌న‌ను వాడుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్న శ్రీ‌రెడ్డిని బాయ్ కాట్ చేయ‌డం స‌రికాద‌న్నారు. శ్రీ‌రెడ్డి నోరు మూయించ‌డానికి అరాచ‌క‌మైన, అన్యాయ‌మైన మార్గాన్ని`మా` ఎంచుకుంద‌ని, ఆ చ‌ర్య‌ల‌ను స‌భ్య స‌మాజం ఖండించాల‌ని అన్నారు. దానికి బ‌దులు, శ్రీ‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల గురించి ఆలోచించి, ఇటువంటివి ఇండ‌స్ట్రీలో జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని మా భావించి...శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌ల‌ను బేస్ చేసుకుని ఇటువంటి వాటికి పాల్ప‌డే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటే బాగుండేద‌న్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో అమ్మాయిల‌ను వాడుకోవ‌డం, కాస్టింగ్ కౌచ్ పై  `మా `ప్ర‌త్యేకంగా ఒక క‌మిటీలాంటిది వేస్తే బాగుంటుంద‌న్నారు. ప‌ని చేసే చోట స్త్రీలు  లైంగిక వేధింపుల‌కు గురైన సంద‌ర్భంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలున్నాయ‌ని, వాటిని అమ‌లు చేస్తూ వ్య‌వ‌స్థాగ‌తంగా ముందుకు పోవాల‌ని సూచించారు. శ్రీ‌రెడ్డి ఫిర్యాదును ఫిర్యాదులా కాకుండా...ఒక అవ‌కాశంగా తీసుకొని ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై చ‌ర్య‌లు తీసుకుని ఉంటే `మా` గౌర‌వం ఇంకా పెరిగేద‌ని అన్నారు. అలా కాకుండా నియంతృత్వ ధోర‌ణిలో శ్రీ‌రెడ్డి వంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం మంచిది కాద‌న్నారు. శ్రీ‌రెడ్డి అన్యాయానికి గురైన మాట వాస్త‌వ‌మ‌ని, ఆమె మ‌నోభావాలకు గౌర‌వ‌మిస్తూ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా `మా` అడుగులు వేస్తే బాగుంటుంద‌ని మ‌హేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. 
Tags:    

Similar News