తెలివితేట‌లున్న కంత్రీవోడు!

Update: 2018-10-24 13:25 GMT
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ తో ఓపిగ్గానే వేచి చూశారు. అందుకు త‌గ్గ‌ట్టే నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తి పెంచుతూ సాగింద‌న్న ప్ర‌శంస ద‌క్కింది. ముఖ్య ంగా ఈ సినిమాని రెగ్యుల‌ర్ క‌థ‌తో కాకుండా కొత్త‌ద‌నం నిండిన కథాంశంతో చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నార‌ని సుకుమార్ - కీర‌వాణి లాంటి దిగ్గ‌జాలు వేదిక‌పైనే పొగిడేయ‌డం చూస్తుంటే స‌వ్య‌సాచి చిత్రం చైతూకి మ‌రో మైలు రాయి కాబోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ప్రేమ‌మ్ లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ ని ఇచ్చిన చందు మొండేటి ఆ సినిమా సెట్‌ లో ఉండ‌గానే నాకు ఈ సినిమాకి సంబంధించిన లైన్ చందు వినిపించార‌ని నేటి ట్రైల‌ర్ ఈవెంట్ లో తెలిపాడు. వెంట‌నే చేసేద్దామ‌ని ఎగ్జ‌యిట్ అయితే బావుండ‌ద‌ని వేచి చూశాన‌ని - అయితే చందు ఆ త‌ర్వాత రెండు మూడు నెల‌ల్లోనే క‌థ చెప్పేయ‌డంతో ఎంతో హ్యాపీ ఫీల‌య్యాన‌ని చై చెప్పాడు. మైత్రి సంస్థ లాంటి పెద్ద సంస్థ‌లో ఈ సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. మ‌ళ్లీ ఈ బ్యాన‌ర్‌ లో సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చేశాడు.

అదంతా అటుంచితే.. ఈ వేదిక‌పై సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఓ మాట‌న్నారు. చైత‌న్య ఓ తెలివితేట‌లున్న కంత్రీవోడి పాత్ర‌లో న‌టించాడ‌ని కితాబిచ్చేశారు. చైత‌న్య పాత్ర ఎంతో వైబ్రేంట్‌ గా ఉంటుంద‌ని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంతో తాను తిట్టినా - దండించినా త‌ల‌దించుకుని వెళ్లిపోయే కుర్రాడు చందు మొండేటి. అందుకే త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌గ‌లిగాన‌ని - ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గా బోలెడంత ఘ‌ర్ష‌ణ ప‌డ్డామ‌ని కీర‌వాణి తెలిపారు. అయితే అదంతా మంచి ఔట్ పుట్ కోస‌మేన‌ని అన్నారు. స‌వ్య‌సాచి ట్రైల‌ర్ వీక్షిస్తే త‌న‌ని త‌రుముకు వ‌చ్చే ప్ర‌మాదాన్ని అత‌డు ఎలా ఎదుర్కొన్నాడు?  ఎంత తెలివైన గేమ్ ఆడాడో అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్‌లో కీర‌వాణి రీరికార్డింగ్ ఆక‌ట్టుకున్నాయి. న‌వంబ‌ర్ 2న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంత‌కుముందే ఈనెల 27న ప్రీరిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే కార్య‌క్ర‌మాలు ప్లాన్ చేశామ‌ని కీర‌వాణి తెలిపారు.


Tags:    

Similar News