కీర్తి డబ్బింగ్ వీడియో వైరల్

Update: 2018-05-21 04:16 GMT
‘మహానటి’ సినిమాతో నటిగా ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేసింది కీర్తి సురేష్. సావిత్రి లాంటి మహానటిని మ్యాచ్ చేయడమంటే మాటలు కాదు. సావిత్రి లాంటి రూపం ఒక్కటి ఉంటే సరిపోదు. ఆమెలా అభినయించాలి. ఆమెలా హావభావాలు పలికించాలి. ఆమెలా నడవాలి. ఆమెలా మాట్లాడాలి. ఐతే ఈ విషయాలన్నింటిలో కీర్తి మంచి మార్కులే కొట్టేసింది. స్వతహాగా మలయాళీ అయిన ఈ అమ్మాయి ‘మహానటి’లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే తెలుగు భాష నేర్చుకుని.. సావిత్రి పాత్ర చేస్తూ స్పష్టంగా డైలాగులు చెప్పడమంటే అంత సులువైన విషయం కాదు. డబ్బింగ్ దగ్గర ఎంత కష్టమై ఉంటుందో అంచనా వేయొచ్చు. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేకులు అవసరమై ఉంటాయో ఊహించవచ్చు.

ఆ కష్టమేంటో చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది ‘మహానటి’ టీం. డబ్బింగ్ స్టూడియోలో కీర్తి పాట్లన్నింటినీ ఇందులో చూపించారు. ఒక్క చిన్న డైలాగ్ కోసం ఎన్ని టేకులు తీసుకుందో ఇందులో చూడొచ్చు. తొలి సినిమా అవకాశం అందుకుని.. అందులో ‘ఈ రోడ్డేమైనా నీ బాబుదనుకున్నావా’ అనే డైలాగ్ చెప్పలేక ఆమె ఇబ్బంది పడే తీరును డబ్బింగ్ స్టూడియోలో చిత్రించిన తీరు భలేగా ఉంది. డబ్బింగ్ చెబుతూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్లతో కట్టిపడేసింది కీర్తి. ఈ వీడియో అంతా చూపించి.. ఈ సినిమాలో కీర్తి పెర్ఫామెన్స్ కు వచ్చిన ప్రశంసలన్నింటినీ చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్రెడీ ‘మహానటి’ సినిమాతో మైమరిపించిన కీర్తి.. ఈ వీడియోతో మరింతగా అభిమానుల్ని అలరిస్తోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News