అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే టెన్షన్!

Update: 2022-06-23 08:30 GMT
యంగ్ హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి కిరణ్ అబ్బవరం నిరంతరం తాపత్రయపడుతుంటాడు. జయాపజయాల సంగతి అలా ఉంచితే తవంతు ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటాడు. అలాంటి కిరణ్  తాజా చిత్రంగా 'సమ్మతమే' రూపొందింది. ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ఈ వేదికపై కిరణ్ అబ్బవరం మాట్లాడాడు.

"మొదటి నుంచి నేను గమనిస్తున్నాను. సినిమా తీయడం ఒక ఎత్తు .. దానిని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. రిలీజ్ చేస్తే థియేటర్లకి జనాలు వస్తారా లేదా టెన్షన్. సినిమా బాగుందనే టాక్ వచ్చేది .. జనాలు మాత్రం థియేటర్స్ కి వచ్చేవారు కాదు.

జనాలను థియేటర్స్ కి రప్పించడం ఎలా అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా అదే టెన్షన్ .. ఇంతవరకూ ఈ సినిమా చూసిన వాళ్లంతా మంచి సినిమా తీశారనే అంటున్నారు. కానీ జనాలు థియేటర్లకు వస్తారా అనేదే  డౌటు. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే .. థియేటర్ సిస్టాన్ని మనమంతా కాపాడుకుందాం.

ఒకప్పుడు గోడపై పోస్టర్ చూసి సినిమాకి వెళ్లేవారు  .. ఇప్పుడు హీరో వెళ్లి తలుపు తట్టి మరీ తన సినిమా చూడామని అడిగే పరిస్థితి వచ్చింది. ఫస్టు నుంచి కూడా నేను ఒకటే మాట చెబుతున్నాను.

నా సినిమా కంటెంట్ బాగుంటేనే సినిమాకి రండి .. లేకపోతే రావొద్దు. అలా చేయడం వలన కంటెంట్ విషయంలో నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. కొంచెం వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని చూడొద్దు. ఒక సినిమా ఎంతోమంది జీవితాలతో  ముడిపడి ఉంటుందనే విషయాన్ని మరిచిపోవద్దు.

అల్లు అరవింద్ గారు .. బన్నీ వాసుగారు  ఇద్దరూ కూడా నెక్స్ట్ వీక్ 'పక్కా కమర్షియల్'  సినిమా పెట్టుకుని, నా సినిమా ఫంక్షన్ కి వచ్చారు. అందుకు వాళ్లకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్లతో కాసేపు మాట్లాడితే చాలు మనపై మనకి ఒక నమ్మకం వస్తుంది. వాళ్లు అందించిన సహాయ సహకారాలను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు"అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News