'కాఫీ విత్ కరణ్' ప్రోమో: VD తో డేటింగ్ కోసం జాన్వీ - సారా ఆరాటం..!

Update: 2022-07-12 09:57 GMT
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' అనే టాక్ షో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం.. ఇటీవలే 7వ సీజన్ తో వచ్చింది. అయితే ఈసారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ మరియు రణవీర్ సింగ్ గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ తదుపరి ఎపిసోడ్ కు బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్ గెస్టులుగా హాజరయ్యారు. తాజా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. తాను విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రోమో విషయానికొస్తే "నమస్తే దర్శకోన్" అంటూ సారా స్టైల్లో ఇద్దరినీ స్వాగతించాడు కరణ్ జోహార్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు వీడియోలలో సారా తరచుగా తన అభిమానులను మరియు ఫాలోవర్స్ ను దర్శకన్ గా  సూచిస్తూ ఉంటుంది. ఇక సారా - జాన్వీ మధ్య స్నేహం ఎలా మొదలైందని కరణ్ అడగ్గా.. 'నిజానికి మీరు అసభ్యకరమైన కోణాన్ని బయటకు తెస్తారని చాలా మంది మాకు చెప్పారు' అని జాన్వీ చెప్పింది.

ఆ తర్వాత ఎవరితో డేటింగ్ చేయాలని అనుకుంటున్నావ్ అని చెప్పమని సారా ని అడుగుతాడు కరణ్. దీనికి సమాధానం చెప్పడానికి ఆలోచించినట్లు ఎస్ప్రెషన్స్ పెట్టిన సారా.. విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. దీంతో జాన్వీ ఫేస్ మారిపోయింది. 'నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా?' అని సారా అడుగుతుంది.

గత సీజన్ లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న జాన్వీ.. విజయ్ దేవరకొండ పట్ల తనకున్న అభిమానం గురించి చెప్పింది. ఇప్పుడు సారా కూడా రౌడీ స్టార్ వీడీ తో డేటింగ్ చేయాలని ఉందని ఓపెన్ గా చెప్పేసింది. ఇలా ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు విజయ్ తో డేటింగ్ చేయాలని కరణ్ షోలో చెప్పడం వైరల్ గా మారింది.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది వీడీ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. త్వరలోనే వీరిద్దరు కూడా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొననున్నారు. అంతకంటే ముందుగా VD గురించి సారా - జాన్వీలు మాట్లాడిన ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'కాఫీ విత్ కరణ్' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ని కరణ్ జోహార్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. "నాకు ఇష్టమైన ఇద్దరు అమ్మాయిలు వారి అన్ ఫిల్టర్డ్ బెస్ట్! జూలై 14 నుండి డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కానున్న 7వ సీజన్ ఎపిసోడ్-2 కోసం సిద్ధంగా ఉండండి.." అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇకపోతే ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై రూపొందించిన 'లైగర్' చిత్రాన్ని ఆగస్ట్ 25న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ - పూరీ కలిసి 'జనగణమన' అనే భారీ సినిమా చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News