వైట్లతో వచ్చిన సమస్య ఇదే

Update: 2020-04-02 04:11 GMT
దూకుడు వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రంను ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల ఈమద్య కాలంలో కెరీర్‌ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అందుకు కారణం ఆయన కోన వెంకట్‌ తో విభేదించడమే అని చాల మంది అనుకుంటున్నారు. గతంలో కోన వెంకట్‌ అందించిన కథలతో మంచి సక్సెస్‌ లు దక్కించుకున్న వైట్ల ఇప్పుడు ఆయన సహకారం లేకపోవడంతో సొంతంగా కలం పట్టుకున్నాడు. దాంతో ఆయన వరుసగా ఫ్లాప్‌ లు చవిచూడాల్సి వచ్చిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా కూడా వైట్లతో విభేదాల విషయం నిజమే అంటూ గతంలో మాట్లాడిన రచయిత కోన మళ్లీ తాజాగా ఒక టాక్‌ షోలో ఆ విషయమై స్పందించాడు.

దర్శకుడు శ్రీనువైట్ల మంచి ప్రతిభ ఉన్న దర్శకుడే అయినా కూడా ఒక సక్సెస్‌ క్రెడిట్‌ అంతా కూడా తనదే అని.. తానే ఆ క్రెడిట్‌ మొత్తం దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. సినిమా అనేది టీం వర్క్‌.. సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా అందులో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందనే విషయం ఆయన ఒప్పుకోడు. ఒక సంగీత దర్శకుడు పది ట్యూన్స్‌ ఇస్తే అందులోంచి ఒక మంచి ట్యూన్‌ ను ఎంపిక చేసినంత మాత్రాన ఆ ట్యూన్‌ సక్సెస్‌ కు కారణం తానే అని చెప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్‌. ఇదే వైట్లతో వచ్చిన సమస్య అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా కోన చెప్పడం జరిగింది.

రచయితలు ఒక సీన్‌ కు పలు వర్షన్‌ లు రాసి ఇస్తారు. వారు ఇచ్చిన దాంటో ఒక మంచి వర్షన్‌ ను తీసుకుని దానికి చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే చేసుకుని దర్శకుడు తెరకెక్కిస్తాడు. అంత మాత్రాన పూర్తి క్రెడిట్‌ తనకే దక్కాలని దర్శకుడు అనుకోవడం సబబు కాదు.

సక్సెస్‌ లు వచ్చిన సమయంలో మొత్తం నేనే చేశాను అనే ఫీలింగ్‌ అతడికి వచ్చినట్లుగా నాకు అనిపించింది. అందుకే ఆయనతో దూరంగా వచ్చేశానని కోనా చెప్పుకొచ్చాడు. అతడితో శత్రుత్వం.. పగ ప్రతీకారాలు ఏమీ లేవని మళ్లీ ఆయనతో వర్క్‌ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్లుగా కోన ఆ టాక్‌ షో లో చెప్పుకొచ్చాడు. సినీ వర్గాల వారు ప్రేక్షకులు మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ఆశపడుతున్నారు.
Tags:    

Similar News