ఇలా అయ్యిందేంటి ఆది!

Update: 2018-08-27 01:30 GMT
క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంత పేరున్నా కొందరు నటులు హీరోగా చేసే ప్రయత్నాలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవడం ఎప్పటి నుంచో చూస్తున్నదే. విలన్ గా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత స్టార్ హీరోల దాకా ఎదిగిన వాళ్ళలో చిరంజీవి మొదలుకుని గోపీచంద్ వరకు చాలానే ఉన్నారు. అలాగే టాలెంట్ ఎంత ఉన్నా హీరోగా ప్రేక్షకులను మెప్పించలేక సపోర్టింగ్ రోల్స్ లోనే గొప్ప పేరు తెచ్చుకున్న శరత్ బాబు లాంటి వాళ్ళూ ఉన్నారు. ఆది పినిశెట్టి మొదటి బ్యాచ్ లో ఉండాలని ట్రై చేస్తుంటే ఆడియన్స్ మాత్రం అతన్ని రెండో క్యాటగిరీలో వేస్తున్నారు. ఇందులో అతని తప్పేమి లేదు. కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నా దర్శకుల తప్పిదం వల్ల సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. నీవెవరో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. థ్రిల్లర్ జానర్ లో  ఓ మాదిరి అంచనాలతో కోన వెంకట్ రచనలో హరి నాధ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ఈ మూవీ టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా లేదు.  బాగా బోరింగ్ గా తీశారంటూ ప్రేక్షకుల నుంచి తీర్పు రావడంతో నిలవడం కష్టంగానే ఉంది.

కోన వెంకట్ దీని మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. మౌత్ టాక్ తో పాటు వెబ్ రివ్యూస్ అన్ని ప్రతికూలంగా ఉండటంతో సోషల్ మీడియాలో ఇవేవి ఫలితాన్ని ప్రభావితం చేయవని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఎంతగా చెప్పుకున్నప్పటికీ టికెట్ కౌంటర్ల దగ్గర వాస్తవ పరిస్థితి ఆయన చెబుతున్న దానికి అనుకూలంగా లేదు. సరైనోడు రంగస్థలం లాంటి సినిమాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి హీరోగా మాత్రం కనీస స్థాయిలో మెప్పించలేకపోతున్నాడు. గతంలో చేసిన మలుపు ఏకవీర లాంటివి సైతం ఇదే ఫలితాన్ని అందుకున్నాయి. ఈరకంగా చూస్తే కోన వెంకట్ ఆది పినిశెట్టి ఇద్దరి  ఖాతాలో జాయింట్ గా మరో ప్లాప్ చేరినట్టే. ఆదితో గతంలో కోన వెంకట్ నిన్ను కోరి తీసినప్పుడు అందులో నాని మేజిక్ బాగా పనిచేసింది. కానీ నీవెవరోలో భారం మొత్తం ఆది పినిశెట్టిపైనే పడటంతో పాటు తమిళ్ లో ప్రూవ్ అయిన థ్రిల్లర్ ని  మార్పుల పేరుతో అనవసర కామెడీతో ఏదో చేయబోయిన ప్రయత్నం బెడిసి కొట్టింది. తమిళ్ లో ఆరెక్స్ 100 రీమేక్ కు రెడీ అవుతున్న అది పినిశెట్టి ఇకపై తెలుగులో హీరోగా కంటిన్యూ చేస్తాడో లేక కలిసి వచ్చిన క్యారెక్టర్ రోల్స్ కే కట్టుబడతాడో  వేచి చూడాలి.
Tags:    

Similar News