అటవీ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన 'కొండ పొలం' ట్రైలర్..!

Update: 2021-09-27 10:29 GMT
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''కొండ పొలం''. ఇది అటవీ నేపథ్యంలో సాగే గ్రామీణ అడ్వెంచర్ మూవీ. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఇతర పోస్టర్స్ - 'ఓబులమ్మ' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కొండపొలం' ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ప్రభుత్యోద్యోగం కోసం కష్టపడి చదువుకున్న గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేయడంతో 'కొండ పొలం' ట్రైలర్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరానికి వచ్చి నాలుగేళ్లు కోచింగ్ తీసుకున్నా.. అతనికి జాబ్ దొరకకపోవడంతో తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక స్వగ్రామంలో గొర్రెలకు నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో వాటిని మేపడానికి, రవీంద్ర తన కుటుంబం మరియు గొర్రెలను తీసుకొని కొండపొలం బయలుదేరినట్లు అర్థం అవుతోంది.

కొండపొలం వెళ్లిన తర్వాత అడవుల్లోకి మృగాలు మరియు మానవ మృగాల నుంచి తన గొర్రెలను కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. వైష్ణవ్ తేజ్ ప్రేయసి ఓబులమ్మగా  రకుల్ ప్రీత్ సింగ్ కనిపించింది. గొర్రెల కాపరులుగా డీ గ్లామర్ లుక్ లో ఉన్న ఈ జంట ఆకట్టుకుంటోంది. 'చదువుకున్న గొర్రె చదువుకోని గొర్రె తో మాట్లాడటం చూశావా' అని వైష్ణవ్ ని రకుల్ ఆట పట్టించడం అలరించింది.

అడవుల్లో పులిని చూసినప్పుడు ఏర్పడిన భయం.. జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఉండేదని హీరో రెంటికీ పోలిక చెప్పడం బాగుంది. 'మీతో గొర్రెలు కాదు కదా.. వాటి బొచ్చు కూడా రాదు.. అడవి మీ అబ్బ సొత్తు కాదు' అని రౌడీలకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఇందులో యాక్షన్ కూడా ఎక్కువపాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వీఎస్ అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

'కొండ పొలం' చిత్రంలో సాయి తేజ్ - కోట శ్రీనివాసరావు - నాజర్ - అన్నపూర్ణ - హేమ - ఆంథోనీ - రవి ప్రకాష్ - రచ్చ రవి - మహేష్ విట్టా - ఆనంద్ విహారి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రవణ్ కటికనేని ఎడిటర్ గా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ అనూహ్య స్పందన తెచ్చుకొని.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Full View
Tags:    

Similar News