చిరంజీవికి కరోనా సోకిన నేపథ్యంలో 'ఆచార్య' పరిస్థితి ఎలా ఉంది..?

Update: 2020-11-11 09:10 GMT
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ నవంబర్ 9 నుండి తిరిగి ప్రారంభించి నెల రోజుల లాంగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే చిరంజీవి కి జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ అని రావడంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోఉన్నారు. ఈ నేపథ్యంలో కొరటాల చిత్రీకరణ ఆపేయకుండా చిరు లేని సీన్స్ ని ముందుగా తీస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల ఇప్పట్లో షూటింగ్ రీస్టార్ట్ చేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది.

ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇంకొన్నాళ్లు ఆగాలని నిర్ణయించుకున్నాడట కొరటాల. పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత షూటింగ్ ను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. మెగాస్టార్ సైతం రిస్క్ తీసుకోవడం ఎందుకు.. మరో రెండు నెలలు వెయిట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారట. మరి 'ఆచార్య' టీమ్ దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021 సమ్మర్ కి 'ఆచార్య' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.
Tags:    

Similar News