ఇకపై దేవిశ్రీతో మైత్రీ బంధం ఎలా ఉంటుందో?

స్టేజ్ మీదనే నిర్మాతను ఉద్దేశిస్తూ నవ్వుతూనే తన అసంతృప్తిని బయటపెట్టాడు.

Update: 2024-11-25 10:45 GMT

'పుష్ప 2: ది రూల్' మ్యూజిక్ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ ను కాదని, మరో ముగ్గురు సంగీత దర్శకులను ఈ మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం తీసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న డీఎస్పీ.. చెన్నైలో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో ఓపెన్ అయిపోయాడు. తన మనసులోని బాధనంతా వెళ్లగక్కాడు. స్టేజ్ మీదనే నిర్మాతను ఉద్దేశిస్తూ నవ్వుతూనే తన అసంతృప్తిని బయటపెట్టాడు.

"మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి. అది నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ?" అని దేవిశ్రీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు 'పుష్ప' నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ ను ప్రస్తావిస్తూ.. "నేను స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడానని నన్ను ఏమీ అనొద్దు. ఎందుకంటే.. నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు. మీకు నాపై చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద మీకు ప్రేమ కంటే కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి.. ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా రాంగ్‌ టైమింగ్‌, లేట్ అన్నారు. నేనేం చెయ్యను సార్. ఇవ్వన్నీ సెపరేట్ గా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా అడిగేయాలి. సో నేనెప్పుడూ ఆన్‌ టైం'' అని అన్నారు డీఎస్పీ.

'పుష్ప 2' ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన ఈ మాటలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం పట్ల తాను చాలా అసంతృప్తితో ఉన్నట్లు ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. చూస్తుంటే పుష్ప సీక్వెల్ మ్యూజిక్ విషయంలో నిర్మాత, సంగీత దర్శకుడి మధ్య మాటలు జరిగాయేమో అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ రాబోయే ప్రాజెక్ట్స్ లో డీఎస్పీ భాగం అవుతారా? అనే చర్చలు మొదలయ్యాయి.

'పుష్ప 2' కాకుండా మైత్రీ బ్యానర్ లోనే దేవిశ్రీ ప్రసాద్ మరో రెండు సినిమాలు చెయ్యాల్సి ఉంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి అతనే సంగీత దర్శకుడు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికలో రాబోతున్న చిత్రమిది. 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందనున్న 'RC 17' సినిమాకి కూడా దేవినే తీసుకున్నారు. అయితే ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమా బీజీఎం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఇవ్వడం, దేవిశ్రీ పబ్లిక్ గా అసంతృప్తి వ్యక్తం చేయడంతో వీరి మైత్రీ బంధం ఇకపై ఎలా వుంటుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిజానికి దేవీశ్రీ చెప్పినట్లుగానే ఏదైనా ఓపెన్ గా అనేయడం ఆయనకు అలవాటు. గతంలో 'లెజెండ్' మూవీ టైమ్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పీచ్ పై సభాముఖంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 రోజులు దేవిశ్రీ ప్రసాద్ ని నిద్ర పోనివ్వకుండా, దగ్గరుండి ఆర్ఆర్ చేయించుకున్నాను అని బోయపాటి అనడంతో.. పక్కనే ఉన్న దేవి మైక్ అందుకొని కౌంటర్ ఇచ్చారు. "ఎవరి క్రెడిట్ వాళ్లకు ఇవ్వాలి.. రీరికార్డింగ్ నేనే చేశాను. ఒకసారి జాబ్ నా చేతిలో పెట్టారు అంటే మీరే నిద్రపొమ్మన్నా నేను నిద్రపోను. నిద్రపోవద్దు అని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా నేను వినను. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. నేను సినిమాని నెగ్లెట్ చేసే స్థితికి నేను దిగజారలేదు. దిగజారను. నేను ఎంత కష్టపడి పని చేయాలనే దాని గురించి ఇంకొకరు నాకు ఇన్స్ట్రక్ట్ చెయ్యాల్సిన పని లేదు. ఎవరో నన్ను పిండుకోవాల్సిన అవసరం లేదు. పిండుకోడానికి నేనేమన్నా ఆవు నా?" అంటూ మాట్లాడారు. ఇదంతా తాను పాజిటివ్ గానే చెప్తున్నానని, నెగిటివ్ గా చెప్పడంలేదని అన్నారు.

అయితే ఇంత జరిగినా బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాలకి దేవీశ్రీ ప్రసాద్ ని కొనసాగించారు. 'జయ జానకీ నాయక', 'వినయ విధేయ రామ' సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాల నుంచి థమన్ తో వెళ్తున్నారు. గతంలో డీఎస్పీతో వర్క్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులు సైతం ఇటీవల కాలంలో వేరే సంగీత దర్శకులతో మ్యూజిక్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ తమ సినిమాలకు దేవీనే కొనసాగిస్తారా లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకి ముందుగా దేవిశ్రీ ని అనుకొని, ఇప్పుడు జివి ప్రకాష్ కుమార్ తో ముందుకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. మరి 'పుష్ప 2' రిలీజ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News