చిరు 152: వాటా ఇచ్చి ముకుతాడు వేశారా?

Update: 2019-02-05 06:45 GMT
టాలీవుడ్ లో 100 శాతం స‌క్సెస్ రేటు ఉన్న ద‌ర్శ‌కుల జాబితాను తిర‌గేస్తే అందులో కొర‌టాల శివ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న సినిమా తీస్తే హిట్టే అన్న క్రేజు ట్రేడ్ వ‌ర్గాల్లో ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే కొర‌టాల ఓ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు అంటే .. దానిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. మ‌హేష్ హీరోగా `భ‌ర‌త్ అనే నేను` చిత్రం తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న కొర‌టాల ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టించే 152వ సినిమాకి స్క్రిప్టు రెడీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. చిరు `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రం పూర్తి చేసి వెంట‌నే కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. చిరు స‌ర‌స‌న ప‌లువురు క‌థానాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించార‌ని వార్త‌లొచ్చాయి.

ఈ ప‌నుల్లో ఉండ‌గానే కొర‌టాల గురించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. చిరంజీవి 152 కోసం పారితోషికంగా కొర‌టాల ఏం తీసుకుంటున్నాడు? అన్న దానికి స‌న్నిహితులు ఇచ్చిన స‌మాచారం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. రూ.2కోట్ల అడ్వాన్స్ ను ఇప్ప‌టికే కొర‌టాల‌కు ఇచ్చార‌ట‌. అలాగే కొన్ని ఏరియాల హ‌క్కుల్ని పారితోషికంగా ముట్ట‌జెబుతామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాటిచ్చార‌ట‌. వాస్త‌వానికి ఒక్కో సినిమాకి కొర‌టాల రూ.10-15 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడ‌ని బ‌య‌ట ప్ర‌చారం ఉంది. అంటే రూ.2కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకున్నా, మిగ‌తా మొత్తం ఏరియా హ‌క్కుల రూపంలో అత‌డికి ద‌క్కుతాయి. కోస్తా ఆంధ్రా లో కొన్ని ఏరియాల్ని కొర‌టాల‌కు అప్ప‌జెప్పేందుకు డీల్ కుదిర్చార‌న్న మాటా వినిపిస్తోంది.

ఏరియాను బ‌ట్టి హీరోల‌కు డిమాండ్ ఉంటుంది. అక్క‌డ బిజినెస్, క‌లెక్ష‌న్స్ స్పీడ్ ఉంటుంది. మెగాస్టార్ న‌టించిన‌ ఖైదీనంబ‌ర్ 150 చిత్రానికి కేవ‌లం గుంటూరు, కృష్ణ ఏరియా తీసుకున్నా ఏకంగా రూ.10కోట్ల వ‌సూళ్లు ద‌క్కాయి. అదే తీరుగా కొర‌టాల‌కు ఏరియా వైజ్ రెవెన్యూ రూపంలో బాగానే వ‌ర్క‌వుట‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మినిమంగా ఈ ప్రాజెక్టుతో అత‌డికి 10-15 కోట్లు గిట్టుబాటు అయ్యే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో పాటు వేరొక కోణంలో చూస్తే.. ఏరియా హ‌క్కులు .. లాభాల్లో వాటా అంటే ద‌ర్శ‌కుడికి ముకుతాడు వేసిన‌ట్టే.. సినిమా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని బాధ్య‌త‌గా తీయాల‌నేది దాని ఉద్ధేశం. ఇది ఇరువురికి క‌లిసొచ్చే డీల్ అనే భావించ‌వ‌చ్చు.
Tags:    

Similar News