మూర్ఖాభిమానులకు క్రిష్ ఘాటు సమాధానం

Update: 2017-01-23 08:00 GMT
సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ గురించి మన సెలబ్రెటీలు ఓపెన్ గా మాట్లాడటానికి అంతగా ఇష్టపడరు. ఐతే దర్శకుడు క్రిష్ మాత్రం ఈ విషయంలో ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల విషయంలో మెగా-నందమూరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్స్ విషయంలో క్రిష్ మరోసారి ఘాటుగా స్పందించాడు. కులాల ప్రాతిపదికన విడిపోయి.. అభిమానులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంపై క్రిష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిరంజీవి.. బాలకృష్ణ లాంటి లెజెండ్స్ ను గౌరవించుకోవడం తెలియని మూర్ఖులారా అంటూ అభిమానుల్ని టార్గెట్ చేశాడు క్రిష్.

‘‘మనల్ని ఇప్పటికీ నార్త్ ఇండియన్స్ మదరాసీల్లాగే భావిస్తారు. ఈ నేపథ్యంలో శాతకర్ణి లాంటి గొప్ప తెలుగు చక్రవర్తి గురించి సినిమా తీసిన నేపథ్యంలో నేను తెలుగేతరుల్ని ఖబడ్దార్ అన్నాను. నేను ఆ మాట వాడాల్సింది కాదు. కానీ దాన్ని మరోలా అర్థం చేసుకుని ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. నేను దీనిపై వివరణ ఇచ్చినా కొందరు అభిమానులు ఊరుకోలేదు. బాగా చదువుకుని.. అమెరికాలో ఎమ్మెస్ చదువుతున్న వాళ్లు ఈ ఫ్యాన్స్ వార్స్ లో భాగమవుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కులాల ఆధారంగా విమర్శించుకుంటున్నారు. ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? మీ గురించి.. మీ చదువు గురించి.. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. చిరంజీవి.. బాలకృష్ణ లాంటి లెజెండ్స్ గురించి మాట్లాడే స్థాయా మీది? ఆ మాటకొస్తే నాకు కూడా ఆ స్థాయి లేదు. వాళ్లిద్దరూ లెజెండ్స్. 150 సినిమాలు చేశారు చిరంజీవి గారు. స్వయం కృషితో ఎదిగారు. ఈ వయసులోనూ ఎంతో కష్టపడి ఖైదీ నెంబర్ 150 సినిమా చేశారు. బాలయ్య గారు 100 సినిమాలు చేశారు. ఎన్నో గొప్ప పాత్రలు వేశారు. 56 ఏళ్ల వయసులో గుర్రాన్ని ఎంత గొప్పగా అదుపు చేశారో.. రోజుకు 14-18 గంటలు ఎలా కష్టపడ్డారో నాకు తెలుసు. అలాంటి లెజెండ్స్ ను మనం గౌరవించుకోవాలి. వాళ్ల గురించి కామెంట్ చేస్తే ఆకాశం మీదికి చూస్తూ మన మీదికి మనమే ఉమ్మేసుకున్నట్లు. చిరంజీవి గారు బాలయ్య సినిమా బాగా ఆడాలని శుభాకాంక్షలు చెప్పారు. నిజమైన అభిమాని ఆయన శుభాకాంక్షలు నిజమవ్వాలని కోరుకోవాలి. అలాగే తమ హీరో సినిమాకు శుభాకాంక్షలు చెప్పినందుకు చిరంజీవి సినిమా బాగా ఆడాలని బాలయ్య ఫ్యాన్స్ ఆకాంక్షించాలి’’ అని క్రిష్ తనదైన శైలిలో చెప్పాడు.


Tags:    

Similar News