శాతకర్ణి క్రెడిట్.. వాళ్లిద్దరిదేనట

Update: 2017-01-21 09:33 GMT
గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాన్ని 79 రోజుల్లోనే పూర్తి చేయగలిగానంటే అది ప్రధానంగా ఇద్దరి వల్లే సాధ్యమైందని అంటున్నాడు డైరెక్టర్ క్రిష్. అందులో ఒకరు కెమెరామన్ జ్నానశేఖర్ అయితే.. ఇంకొకరు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా అని రాజమౌళితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు క్రిష్. సినిమా పూర్తి కావడానికి మాటల రచయిత ఎలా కారణమవుతాడని రాజమౌళి సందేహం వ్యక్తం చేస్తే క్రిష్ అందుకు వివరంగా సమాధానమిచ్చాడు.

‘‘కంచె సినిమానే నాకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ సినిమాకు పని చేసిన యూనిట్టే దీనికీ పని చేయడంతో నా పని సగం తగ్గినట్లయింది. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగడంతో ఎక్కడా ఇబ్బంది రాలేదు. యూనిట్లో అందరూ చాలా కష్టపడి శ్రద్ధతో పని చేశారు. ఐతే సినిమాటోగ్రాఫర్ జ్నానశేఖర్.. మాటల రచయిత సాయిమాధవ్ సినిమా వేగంగా పూర్తి కావడానికి ముఖ్య కారకులయ్యారు. జ్నానశేఖర్ గారికి విజువల్స్ పరంగా గొప్ప క్లారిటీ ఉండేది. బడ్జెట్ పరిమితులున్నప్పటికీ ప్రతి భారీ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. చాలా వరకు పెద్ద లైట్లేమీ లేకుండానే భారీ సన్నివేశాలు పూర్తి చేశారు. కాగడాలు పట్టించి నైట్ ఎఫెక్టులో సన్నివేశాలు పూర్తి చేశారు. నాకు ఆయనకు.. మంచి సమన్వయం కుదరడంతో కొన్ని షెడ్యూళ్లను అనుకున్నదానికంటే ముందు పూర్తి చేశాం.

ఇక సాయిమాధవ్ బుర్రా గారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. అప్పటికప్పుడు సీన్ రాసివ్వమంటే రాసిచ్చేసేవాళ్లు. చిత్రీకరణ పరంగా గ్రాండియర్ ఏమైనా తగ్గినప్పటికీ ఆయన తన మాటలతో కవర్ చేశారు. ఆయన సీన్ పేపర్ చూడగానే అందరిలోనూ ఒక రకమైన ఉద్వేగం వచ్చేసేది. ఈ సన్నివేశం మరింత బాగా చేయాలి. త్వరగా చేసేయాలి అనే ఎమోషన్ కలిగించేలా ఆయన డైలాగ్స్ రాశారు. అందుకే సాయిమాధవ్.. జ్నానశేఖర్ సినిమా వేగంగా పూర్తి చేయడానికి ముఖ్య కారకులు అని అంటాను’’ అని క్రిష్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News