బాలయ్య కోసమే ఎన్టీఆర్ వదిలేశాడు-క్రిష్

Update: 2016-11-29 07:30 GMT
ఎన్నో చారిత్రక పాత్రలు పోషించిన నందమూరి తారక రామారావు శాతకర్ణి పాత్రను మాత్రం తన కొడుకు బాలకృష్ణ కోసమే వదిలేశాడన్నాడు డైరెక్టర్ క్రిష్. బాలయ్య వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి గొప్ప సినిమాను తాను తెరకెక్కించడం తన అదృష్టమని క్రిష్ అన్నాడు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని.. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదలవుతుందని క్రిష్ చెప్పాడు.

‘‘ముక్కలుగా ఉన్న రాజ్యాలన్నింటినీ కలిపి భరతఖండంగా ఒక్కతాటికి తెచ్చి ఏకఛత్రాధిపత్యంగా శాతకర్ణి ఏలాడు. అందుకు గుర్తుగానే ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. అలాంటి చారిత్రక పురుషుడి కథను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు.. అంతగొప్ప తెలుగుజాతి చక్రవర్తి గురించి చెప్పే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా బాలకృష్ణగారి వందో సినిమాగా దీన్ని తియ్యడం నాకు దక్కిన మరో అదృష్టం. తెరపై రాజు అంటే నందమూరి బాలకృష్ణే.

సమ్రాట్‌ అశోక లాంటి క్యారెక్టర్‌ చేసిన ఎన్టీఆర్‌ గారు శాతకర్ణి పాత్రనూ చెయ్యాలనుకొని చెయ్యలేకపోయారు. బాలయ్య కోసమే అలా వదిలేశారేమో. కథ అనుకున్నప్పుడే శాతకర్ణిగా బాలయ్య గారిని తప్ప మరొకరిని ఊహించలేకపోయాం. ఆ పాత్రలో ఆయన బాగా ఇమిడిపోయారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒకానొక గొప్ప సినిమా కాబోతోందని చెప్పగలను. బాలయ్య.. హేమమాలిని.. శ్రియ పాత్రల మధ్య మంచి భావోద్వేగాలుంటాయి. ఓ గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామన్న గట్టి నమ్మకముంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అని క్రిష్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News