మణికర్ణిక : క్రిష్‌ కు ఆ రకంగా కూడా అన్యాయమే

Update: 2019-02-22 17:04 GMT
సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌ లో చాలా అరుదుగా రాణిస్తారు. అలాంటిది క్రిష్‌ కు బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కింది. దాంతో ప్రతిష్టాత్మక 'మణికర్ణిక' చిత్రంకు దర్శకత్వం వహించే బాధ్యత ఆయన్ను వరించింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి చిత్రాన్ని ఆకట్టుకునేట్లుగా చిత్రీకరించించిన క్రిష్‌ పై నమ్మకం లేక కంగనా వేలు పెట్టడం మొదలు పెట్టింది. సినిమా దాదాపుగా పూర్తి చేసిన క్రిష్‌ ను పొమ్మన లేక పొగబెట్టినట్లుగా చేసిన కంగనా పంతం నెగ్గించుకుంది. క్రిష్‌ ఎప్పుడైతే సినిమాను వదిలేశాడో మార్పులు చేర్పులు మొదలు పెట్టింది.

సినిమా విడుదలకు ముందు దర్శకుడు క్రిష్‌ అంటూ చెప్పిన యూనిట్‌ సభ్యులు విడుదల సమయానికి కంగనాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, క్రిష్‌ కు క్రెడిట్‌ తగ్గించారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమాకు క్రెడిట్‌ మాత్రమే కాకుండా పారితోషికం కూడా సరిగా అందలేదని క్రిష్‌ అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్రిష్‌ మాట్లాడుతూ.. నిర్మాత అనారోగ్యంగా ఉన్న కారణంగా రెమ్యూనరేషన్‌ విషయంలో తాను బలవంతం చేయలేదని, ఒప్పందం చేసుకున్న పారితోషికంలో కేవలం 30 శాతం మాత్రమే ముట్టిందని క్రిష్‌ చెప్పుకొచ్చాడు.

ఆ డబ్బు ఉంటేనే బతకగలను అని ఏమీ లేదు కనుక నేను పారితోషికం విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. అయితే నాతో వర్క్‌ చేసిన కొందరు సహాయ దర్శకులను నేను చెప్పినా కూడా వారి పేర్లను చేర్చలేదు. ఆ విషయంలో సహాయ దర్శకుడు ఒకతను నా వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడు. మణికర్ణిక విషయంలో తాను చాలా నష్టపోయాను అంటూ క్రిష్‌ మరోసారి ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News