విదేశాల‌కు కృష్ణంరాజు..! MAA ఎన్నికల అధికారి ఎవ‌రంటే?

Update: 2021-09-06 08:36 GMT
అక్టోబ‌ర్ 10న `మా` అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా (అక్టోబ‌ర్ 15) ముందే కొత్త అధ్య‌క్షుడితో ఈసీ కొలువు దీర‌నుంది. ఇప్ప‌టికే అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు పోటీ ఖాయ‌మైంది. ఎవ‌రికి వారు ప్ర‌చారంలో జోరుమీదున్నారు. ఈసారి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల అధికారిగా అడ్వకేట్‌ కృష్ణమోహన్‌ నియమితులయ్యారు.  ఆయన నియామ‌కంపై `మా` అధ్యక్షుడు నరేశ్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

ఎన్నికల సమయంలో క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజు భార‌త‌దేశంలో ఉండడం లేదు. ఆయన విదేశాలకు వెళ‌తార‌ని .. ఆ స‌మ‌యంలో  ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి పి.శివకృష్ణను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో విడుద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా చూసే బాధ్య‌త ఎన్నిక‌ల అధికారిదే.  జీవీ నారాయణరావును అసిస్టెంట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్ గా నియమించారు. బైలాస్ ప్ర‌కారం ప్ర‌స్తుత అధ్య‌క్షుడే ఎన్నిక‌ల అధికారిని నియ‌మించే నియ‌మం ఉంద‌ని తెలుస్తోంది.

నెల‌రోజులు ఇదే జోరుతో ప్ర‌చార‌హోరు క‌నిపిస్తుంది!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో చిత్రాలెన్నో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప్ర‌కాష్ రాజ్ ఇంత‌కుముందే `సినిమా బిడ్డ‌లు` పేరుతో త‌న ప్యానెల్ స‌భ్యులను ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌రంగా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డాల్సిన జీవిత‌.. హేమ వంటివారి మ‌న‌సు మార్చుకుని ప్ర‌కాష్ రాజ్  తో చేర‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అధ్య‌క్ష ప‌ద‌వి కావాలంటూ చివ‌రికి ఏదో ఒక ప‌ద‌వి కోసం ఆ ఇద్ద‌రూ రాజీకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక మ‌హిళాధ్య‌క్షురాలు అనే మాటే వినిపించ‌డం లేదు.

ప్యానెల్ ని ప్ర‌క‌టించిన ప్ర‌కాష్ రాజ్ త‌న దూకుడును కొన‌సాగిస్తున్నారు. ఇక ప్ర‌కాష్ రాజ్ కి ధీటుగా పోటీప‌డేందుకు మంచు విష్ణు త‌నవైన‌ స‌న్నాహ‌కాల్లో తాను ఉన్నారు. ఇప్ప‌టికే అత‌డు త‌న వ‌ర్గంతో ఎన్నిక‌ల్లో హోరాహోరీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌చారంలో భాగంగా మీడియా చానెళ్ల‌న్నిటీ ప్ర‌కాష్ రాజ్ క‌నిపిస్తున్నారు. ఇక ఊహించ‌ని మ‌లుపుల‌తో బండ్ల గ‌ణేష్ ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేస్తున్న జీవిత‌కు వ్య‌తిరేకంగా పోటీ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. బండ్ల మీడియా లైవ్ ల‌లో మెరిపిస్తున్నారు.  

నిజానికి ప్ర‌కాష్ రాజ్ ని అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డాల్సిందిగా స‌మ‌ర్థించిన వారిలో బండ్ల గ‌ణేష్ ఒక‌రు. ఆయ‌న కు ప్ర‌కాష్ రాజ్ ప్రాధాన్య‌త‌నివ్వ‌క‌పోయినా త‌న మ‌ద్ధ‌తు ప్ర‌కాష్ రాజ్ కే ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ప్రకాష్ రాజ్ అధ్య‌క్షుడు కావాల‌ని కోరుకున్నారు. మునుముందు మంచు విష్ణు వ‌ర్గం నుంచి ప్యానెల్ ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఎన్నిక‌ల్లో మూవీ ఆర్టిస్టుల సంఘం ప‌రువు మ‌ర్యాద‌ల్ని కాపాడ‌డం చాలా ఇంపార్టెంట్. ఇప్ప‌టికే వ‌ర్గ‌పోరు అధిక‌మైంది. ఎవ‌రికి వారు మీడియా ముందుకు వ‌చ్చి ర‌క‌ర‌కాల వివాదాస్ప‌ద అంశాల‌ను తెర‌పైకి తేవ‌డంపైనా క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ఇంత‌కుముందు సీరియ‌స్ అయ్యింది. న‌టి హేమ‌పై చర్య‌ల అనంత‌రం కొంత‌వ‌ర‌కూ మీడియా ముందు అన‌వ‌స‌ర చ‌ర్చ‌ను పోటీదారులు త‌గ్గించారు. మాట్లాడే విధానం కూడా పూర్తిగా మారింది. ఇంత‌కుముందు జీవిత రాజ‌శేఖ‌ర్ బండ్ల గ‌ణేష్ విస‌య‌మై ఆచితూచి ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌కుండా మాట్లాడిన విధానం క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల్ని దృష్టిలో పెట్టుకునే అన్న చ‌ర్చా సాగుతోంది. ఇక వీకే న‌రేష్ .. విష్ణు సైతం ఇప్ప‌టికి పూర్తిగా స్థ‌బ్ధుగా ఉండ‌డం వెన‌క క్ర‌మ‌శిక్ష‌ణా సంఘాన్ని గౌర‌వించ‌డం వ‌ల్ల‌నే అని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు జోరు మీద క‌నిపించిన తెలంగాణ న‌టుడు సీవీఎల్ నుంచి ఎటువంటి ప్ర‌చార హంగామా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న తెలంగాణ క‌ళాకారుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని `మా` అసోసియేష‌న్ రెండుగా చీలాల‌ని అన్నారు. ఇప్పుడు ఆ మాట వినిపించ‌డం లేదు ఎందుక‌నో!!
Tags:    

Similar News