రమ్య అక్కడ.. నేను ఇక్కడ: కృష్ణవంశీ

Update: 2022-08-29 15:30 GMT
కృష్ణవంశీకి ముందు చాలామంది దర్శకులు ఇండస్ట్రీలో ఉన్నారు. కృష్ణవంశీ తరువాత చాలామంది దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు మాత్రం కృష్ణవంశీకి మాత్రమే ఉంది. ఆయనకి ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆ టైటిల్ ఆయనను పట్టుకునే ఉందంటే, ఆయన నుంచి ఎలాంటి సినిమాలు వచ్చి ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. రొమాన్స్ కి సంబంధించిన కథలను .. సామాజిక చైతన్యాన్ని కలిగించే కథలను తెరకెక్కించడంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఎప్పటికప్పుడు ఆ సినిమాలు ఆయన పట్ల గౌరవాన్ని పెంచుతూనే వచ్చాయి.

అలాంటి కృష్ణవంశీ నుంచి కొంతకాలంగా ఆయన స్థాయికి తగిన సినిమాలు రావడం లేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేయడం తనవల్ల కాదంటూ కృష్ణవంశీ తాను నమ్మిన సిద్ధాంతం పైనే కూర్చుంటున్నాడు. తాజాగా ఆయన 'రంగమార్తాండ' అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు.

ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఎమోషన్ ప్రధానంగా ఆయన పాత్ర సాగడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వెళుతున్నాడు.

 తాజా ఇంటర్వ్యూలోని ప్రశ్నలకు సమాధానంగా ఆయన స్పందిస్తూ .. "నటిగా రమ్యకృష్ణ ఫుల్ బిజీ .. ఒక తెలుగులో మాత్రమే కాదు, ఇతర భాషా చిత్రాలతోను ఆమె తీరిక లేకుండా ఉంటుంది. హీరోయిన్  గా మాత్రమే కాదు .. ఇప్పటికీ ఆమె స్టార్ స్టేటస్ కొనసాగుతూనే ఉంది. ఒక భర్తగా ఆమె  రేంజ్ ను మ్యాచ్ చేయాలనే టెన్షన్ నాకు ఉంటుంది. దర్శకుడిగా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అయితే నాది క్రియేటివ్ సైడ్ కావడం వలన ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. అందువలన గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది.

ఇక రమ్యకృష్ణ .. నేను విడిపోయినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. షూటింగ్స్ పరంగా తాను బాబుతో కలిసి చెన్నైలో ఉంటుంది. నేను నా వర్క్ పరంగా హైదరాబాద్ లో ఉంటాను. నాకు వీలైతే నేను చెన్నైకి వెళతాను .. లేదంటే వాళ్లకి తీరిక దొరికితే నా దగ్గరికి వచ్చేస్తారు.

గాసిప్స్ పట్ల ఆసక్తిని చూపించేవారు ఎక్కువ కావడం వలన, ఇలాంటివి పుడుతుంటాయి. మేం ఇద్దరం కూడా ఇలాంటివి పెద్దగా పట్టించుకోము" అంటూ చెప్పుకొచ్చాడు. ఆయనను అభిమానులంతా 'రంగమార్తాండ' కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సారైనా ఆయన హిట్ కొడతాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News