మహేష్ కు పోకిరి.. రోహిత్ కు తుంటరి

Update: 2016-03-09 22:30 GMT
‘గుండెల్లో గోదారి’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కుమార్ నాగేంద్ర. ఆ తర్వాత ‘జోరు’ లాంటి ఫ్లాప్ మూవీ తీశాడు. కెరీర్లో తొలి కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న కుమార్.. ‘తుంటరి’ మీద భారీ ఆశలతోనే ఉన్నాడు. తన సినిమా గురించి, హీరో నారా రోహిత్ గురించి గొప్పగా చెబుతున్నాడు ఈ యువ దర్శకుడు. మహేష్ బాబులోని కొత్త కోణాన్ని ‘పోకిరి’ ఆవిష్కరించినట్లే.. ‘తుంటరి’ రోహిత్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తుందని అంటున్నాడు నాగేంద్ర. ‘‘మహేష్ బాబుకు ‘పోకిరి’ ఎలాగో.. రోహిత్ కు ‘తుంటరి’ అలాగే అవుతుంది. రోహిత్ లోని కొత్త యాంగిల్ ను జనాలకు పరిచయం చేస్తుంది. రోహిత్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తాయి. సినిమాకు అవే ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అని కుమార్ అన్నాడు.

‘తుంటరి విషయంలో రోహిత్ ఇచ్చిన సలహాలు సినిమా బాగా రావడానికి ఎంతో ఉపయోగపడ్డాయని కుమార్ చెప్పాడు. ‘‘రోహిత్ తెలివైన నటుడు. అతడికి చాలా నాలెడ్జ్ ఉంది. అతడి అనుభవం, ఫిలిం మేకింగ్ విషయంలో తన సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. ‘తుంటరి’ బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో రోహిత్ ఆ తరహా హాలీవుడ్ సినిమాలు చాలా చూశాడు. నాకు ఇన్ పుట్స్ ఇచ్చాడు. బాక్సింగ్ సీక్వెన్స్ వచ్చేటపుడు లైటింగ్ తగ్గించమనడంతో పాటు మరికొన్ని విలువైన సూచనలు చేశాడు. ఔట్ పుట్ చూశాక నేనే థ్రిల్లయ్యాను. ఈ సినిమా కోసం రోహిత్ వారం రోజులు శిక్షణ తీసుకున్నాడు. సినిమాలో ప్రతి సన్నివేశం అథెంటిగ్గా ఉండాలని భావించి అందుకోసం చాలా కష్టపడ్డాడు’’ అని నాగేంద్ర చెప్పాడు.
Tags:    

Similar News