భీమ్లా బుకింగ్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదేంటి..?

Update: 2022-02-22 09:32 GMT
పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టిస్తోన్న తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. ఇందులో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్ర పోషించారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మహా శివరాత్రి సంద‌ర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు మూడు రోజులే సమయమే ఉన్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ఆశ్చర్యకరం.  

సాధారణంగా పెద్ద హీరోల చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల తేదీకి కనీసం వారం రోజుల ముందు ప్రారంభమవుతాయి. యూఎస్ఏలో వారం ముందే 'భీమ్లా నాయక్' సినిమా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఎప్పుడు తెరుచుకుంటాయని ఫ్యాన్స్‌ - సినీ గోయర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుడిపై భారం త‌గ్గించాలంటే ఉద్దేశ్యంతో కన్వీనియన్స్ ఫీజు తగ్గింపుకు సంబంధించి నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్.. బుక్ మై షో వారితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చాలా వరకు మల్టీఫ్లేక్స్ లలో 'భీమ్లా నాయక్' అడ్వాన్స్ బుకింగ్స్ తెరుచుకున్నాయి. ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే ఆల్మోస్ట్ అన్నీ అమ్ముడుపోయాయి. మిగతా స్క్రీన్స్ లోనూ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా బుక్‌ మైషోలో ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బుకింగ్స్ ఇంకా తెరవబడలేదు.

ఏపీలో విజయవాడ - ఒంగోల్ వంటి సిటీలలో ఒక్కొక్క మల్టీఫ్లెక్స్ లో భీమ్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వైజాగ్ వంటి పలు ప్రధాన నగరాల్లో ఇంకా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తెరుచుకోలేదని తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో అన్ని ఏరియాలలో ఆన్‌ లైన్ బుకింగ్‌లు ఓపెన్ అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. యుఎస్ లో మాత్రం ప్రీ సేల్స్ లో పవన్ సినిమా సత్తా చాటుతోంది.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర దర్శ‌క‌త్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాట‌లు అందించడంతో పాటుగా ఓ పాట కూడా రాశారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేసింది. లేటెస్టుగా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ - లైక్స్ తో దూసుకుపోతోంది.

ఇకపోతే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇంతవరకు దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదు. మరి ఈ రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News