విక్ర‌మ్ ఆ స్టార్స్ ని ప‌డ‌గొట్టి నిల‌బ‌డ‌గ‌ల‌డా?

Update: 2022-05-29 07:30 GMT
`విశ్వ‌న‌టుడు` క‌మ‌ల్ హాసన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మూడున్న‌రేళ్లు అవుతుంది. `విశ్వ రూపం-2` త‌ర్వాత మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి ఇంత స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా క‌మ‌ల్ సినిమాలు చాలా గ్యాప్ త‌ర్వాత‌నే  విడుద‌ల‌వుతుంటాయి. ఆయ‌న సినిమాల‌కు యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తప్ప‌నిస‌రి కాబ‌ట్టి అలాంటి జానర్ సినిమాలు రావాలంటే స‌మ‌యం త‌ప్ప‌నిస‌రే.

అయితే గ‌తంతో పోల్చుకుంటే ఈసారి ఇంకాస్త వ్య‌వ‌ధి ఎక్కువ‌గా ప‌ట్టింది. జూన్ లో ఆయ‌న క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన  యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విక్ర‌మ్` రిలీజ్ అవుతుంది. క‌మ‌ల్ తో పాటు..విజ‌య్ సేతుప‌తి ప‌హ‌ద్ పాసిల్ లాంటి న‌టులు సైతం భాగ‌మ‌వ్వ‌డంతో సినిమా రెట్టించిన అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

తెలుగు లో చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి భారీ ఎత్తున‌ రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 400స్ర్కీన్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఓపెనింగ్స్ రూపంలోనే వ‌సూళ్లు రాబ‌ట్టాల‌న్న టార్గెట్ తో ఈ రేంజ్లో జూన్ 3న  రిలీజ్ కి దిగుతున్నారు. ఓపెనింగ్స్ వ‌ర‌కూ ఢోకా ఉండ‌దు. క‌మ‌ల్ ఇమేజ్... డైరెక్ట‌ర్ లోకేష్ కన‌గార‌జ్ స‌క్సెస్ రేట్..టీజ‌ర్ ..ట్రైల‌ర్ తో వ‌స్తోన్న పాజిటివ్ టాక్ నేప‌థ్యంలో  భారీ ఎత్తున ఓపెనింగ్స్ ఉంటాయి.

కానీ ఆ త‌ర్వాత `విక్ర‌మ్` స‌వాళ్లు ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న‌ది ట్రేడ్ టాక్. సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చినా ఇటీవ‌లే రిలీజ్ అయిన `ఎఫ్ -3` నుంచి గ‌ట్టిపోటీ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.. అలాగే అదే రోజున అడ‌వి శేష్ హీరోగా న‌టించిన `మేజ‌ర్` కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. `ఉరి` త‌ర‌హా సినిమా కావ‌డంతో ఓ వ‌ర్గం ఆడియ‌న్స్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

మ‌రోవైపు సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌ర్కారి వారి పాట` స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్ప‌టికీ ఆ సినిమా ఆక్యుపెన్సీ స్థిరంగా కొన‌సాగుతుంది. ఇలా మూడు సినిమాల పోటీ మ‌ధ్య‌లో  విక్ర‌మ్ వాటి పోటీని త‌ట్టుకుంటుందా? అన్న‌దే సందేహం గా మారింది. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చినా తెలుగు ఆడియ‌న్స్  క‌మ‌ల్ థియేట‌ర్ వైపు చూస్తారా? అనే  ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

ఇది పూర్తిగా డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్.  అన్ని వ‌ర్గల్ని టార్గెట్ చేయ‌డానికైతే స్కోప్ లేదు.  క‌మ‌ల్ గ‌త సినిమాల తెలుగు వ‌సూళ్లు చూస్తే అంత గొప్ప ట్రాక్ రికార్డు ఏమీ లేదు. పైగా క‌మ‌ల్ అటెంప్ట్ ల  ప‌ట్ల  ఓ వ‌ర్గం ఆడియ‌న్స్ అనాస‌క్తిగానే ఉంటారు. హిట్ టాక్ తెచ్చుకున్నా కొన్ని ఏరియాల్లో క‌మ‌ల్ సినిమాలకు అంత గిరాకీ ఉండ‌ద‌ని పాస్ట్ ఫ‌లితాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి.

క‌మల్ సినిమాల్లో ఎలాగూ క‌మ‌ర్శియ‌ల్ అంశాలు  జొప్పించ‌డం అనేది వీల‌య్యే ప‌నికాదు. వీలైనంత వ‌ర‌కూ కంటెంట్  బేస్డ్ గానే సాగుతాయి. మ‌రి లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌న్న‌ది రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది.  ఇలా ఇన్ని స‌వాళ్లను విక్ర‌మ్ ఎదుర్కుని బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డాల్సి ఉంది. అదే జ‌రిగితే ఆడియ‌న్ టేస్ట్ లో మార్పులొచ్చాయ‌ని నిర్ధారించుకోవ‌చ్చు. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది  జూన్ 3న తెలుస్తుంది. అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News