సర్దార్ గబ్బర్ సింగ్ ఆఫీస్ కు సెక్యూరిటీ పెరిగిపోయింది. ఆడియో రిలీజ్ వేడుకకు ఇంకా గంటలు మాత్రమే సమయం ఉండడంతో పాసుల కోసం వేట తారాస్థాయిలో ఉంది. ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర వేలాది మంది జనాలు గుమిగూడి పాసుల కోసం పాకులాడుతున్నారు. రెండు రోజులుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంది. అంచనాలకు మించి అభిమానులు వస్తూనే ఉండడంతో పోలీసులు వారిని నియంత్రించలేకపోతున్నారు.
పాసులు ఉన్నవారు తప్ప వేరే ఎవరూ ఆడియో వేడుక జరిగే హోటల్ ప్రాంతానికి రావద్దని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన తర్వాత.. పాస్ ఉంటేనే ఎంట్రీ అనే విషయం స్పష్టమైపోయింది. కొంతమంది అభిమానులు గేట్లు విరగ్గొట్టి దూసుకుపోయేందుకు ప్రయత్నించడంతో.. మిగిలినవారు కూడా వారికి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయక తప్పని పరిస్థతి ఏర్పడింది.
తోటి ఫ్యాన్స్ పై లాఠీ తగలడంతో.. రెచ్చిపోయిన అభిమానులు.. వారికి సపోర్ట్ వచ్చేశారు. దీంతో ఫిలింనగర్ పరిసరాలన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. వీరితోపాటు చాలామంది నటులు - కేరక్టర్ ఆర్టిస్టులు - సైడ్ యాక్టర్లు.. పాసుల కోసం వచ్చి గంటలు గంటలు కూర్చుని.. చివరకు ఒట్టి చేతులతో వెళ్లిపోవాల్సి వస్తోంది. ముందు రోజునుంచి ఇదే పరిస్థితి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంకా చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఆయన ఇల్లు - ఆఫీసుల బయట రాత్రంతా ఎదురుచూస్తున్నారు. ఇదంతా చూసి పవన్ మేనియా అనుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నారు పోలీసులు.