సుశాంత్ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోరిన టాలీవుడ్ హీరోయిన్...!

Update: 2020-08-05 08:10 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట అందరూ భావించినా రోజులు గడుస్తున్న కొద్దీ సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులపైన.. ఇండస్ట్రీ మాఫియాపైనా.. నెపోటిజం పైనా కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేసారు.

ఇదిలా ఉండగా సుశాంత్ ది సూసైడ్ కాదని హత్య అని.. సుశాంత్ సూసైడ్ కేసు విషయంలో ముంబై పోలీసులు అనుసరిస్తున్న తీరులో చాలా లోపాలు ఉన్నాయని.. అందుకే ఈ కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పగించి  అతని మరణం వెనుక నిజాలు బయటపెట్టాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేసారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా సుశాంత్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరింది. ''నిజం ఏమిటో తెలియదు కాని ఖచ్చితంగా సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుకుంతున్నాను'' అని ట్విట్టర్ వేదికగా లావణ్య డిమాండ్ చేసింది.

కాగా సుశాంత్ కేసుపై ప్రస్తుతం ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో బీహార్ పోలీసులకు... ముంబై పోలీసు అధికారులు సహకరించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సుశాంత్ కేసు విచారణ నిమిత్తం ముంబై వెళ్లిన తమ సీనియర్ పోలీస్ అధికారిని బలవంతంగా హోం క్వారెంటైన్‌ లో పెట్టడంపై బీహార్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్‌‌ ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని బీహార్‌‌ సీఎం నితీశ్‌ కుమార్‌‌ మంగళవారం ప్రకటించారు.
Tags:    

Similar News