సంక్రాంతికి అక్షరాలా వేయి కోట్లు... ?

Update: 2021-11-21 02:30 GMT
సంక్రాంతి అతి పెద్ద పండుగ. తెలుగు వారికి అది నిజంగా అద్భుతమైన వేడుక. ఒక పండుగ అంటేనే తెలుగు లోగిళ్ళు సందడి చేస్తాయి. అలాంటిది మూడు రోజుల పండుగ దాంతో సంక్రాంతి ఎపుడూ స్పెషలే. ఇక తెలుగు సినీ వర్గాలకు కూడా సంక్రాంతికి మించిన సీజన్ లేదు అని అంటారు. అది ఈనాటి మాట కాదు తెలుగు సినిమా పుట్టి బట్ట కట్టినది లగాయితూ సంక్రాంతికి దూసుకువచ్చే సినిమాల లిస్ట్ ఎపుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇపుడు ఇంకా జోరు పెరిగింది. ఒక వైపు లోకల్ లాంగ్వేజెస్ మూవీస్ తో పాటు మరో వైపు పాన్ ఇండియా సినిమాలు కూడా 2022 సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి.

సంక్రాంతికి వేడుకకు కచ్చితంగా యాభై రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అయితే ఆనాటికి రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్నీ వరసగా క్యూ కట్టేశాయి. డేట్స్ కూడా లాక్ చేసి మరీ కూర్చున్నాయి. ఈసారి సంక్రాతికి వచ్చే సినిమాల ఖరీదు ఎంత అంటే అక్షరాలా వేయి కోట్లు అంటున్నారు. అంటే వేయి కోట్ల మేర బిజినెస్ సాగిందన్న మాట. ఇందులో సింహ వాటా ట్రిపుల్ ఆర్ మూవీకే దక్కింది. నిజానికి కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తొలగలేదు, లేకపోతే కచ్చితంగా పన్నెండు వందల కోట్లకు చేరాల్సిన బిజినెస్ కాస్తా వేయి కోట్లకే పరిమితం అయిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్న మాట.

ఈసారి సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని అయిదు వందల కోట్ల దాకా బిజినెస్ చేసింది అంటున్నారు. ఇది కాక ఆల్ ఇండియా హక్కులు, ఓవర్సీస్ బిజినెస్ అన్నీ కలుపుకుంటే వేయి కోట్లు దాటింది అంటున్నారు. జనవరి ఏడున విడుదల అవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దీని తరువాత రాధేశ్యామ్ మూవీ ఉంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ మూవీ సాహో తరువాత మూడేళ్ల విరామం తో రిలీజ్ అవుతోంది. దాంతో అటు బాలీవుడ్ కూడా ఆశగా ఎదురుచూస్తున్న మూవీగా చూస్తున్నారు. జనవరి 12న రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది.

ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుని మూడు వందల కోట్ల దాకా బిజినెస్ జరిగింది అంటున్నారు. ప్రభాస్ ఉన్న స్టామినా, బాహుబలి తరువాత ఒక్కసారిగా పెరిగిన క్రేజ్ తో ఈ మూవీని ఇంత బిజినెస్ జరిగింది అంటున్నారు. ఇక మూడవ సినిమాగా తీసుకుంటే భీమ్లా నాయక్. ఈ మూవీ వంద కోట్లకు పైగా బిజినెస్ పూర్తి చేసుకుంది అంటున్నారు. అయ్యప్పన్, కోషియం మూవీ రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ మీద భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ జనవరి 12 రిలీజ్ అవుతోంది. ఇక చివరిగా వస్తున్న మూవీ అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబోలోని బంగార్రాజు.

ఈ మూవీ మీద నాగ్ మంచి హోప్స్ పెట్టుకున్నారు. యాభై కోట్ల దాకా బిజినెస్ జరిగింది అంటున్నారు. కంప్లీట్ గ్రామీణ నేపధ్యంతో తీసిన ఈ మూవీ సంక్రాంతికి అసలైన విందు అంటున్నారు. జనవరి 15న ఈ మూవీ రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారని టాక్. ఓవరాల్ గా చూస్తే దాదాపుగా వేయి కోట్ల బిజినెస్ తో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరి ఇవి తెచ్చే కలెక్షన్స్ ని బట్టే టాలీవుడ్ కి అసలైన సంక్రాంతి అని చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News