ఒక మనసు కాంబినేషన్లో ఇంకో సినిమా

Update: 2016-06-28 07:30 GMT
గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఒక మనసు’ సినిమా డివైడ్ టాక్ తో మొదలై.. ఓ మోస్తరు కలెక్షన్లతో నడుస్తోంది. ఐతే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ దర్శకుడు రామరాజుతో ఇంకో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నాడు నిర్మాత మధుర శ్రీధర్. ‘ఒక మనసు’ విడుదలైన రోజే రామరాజు దర్శకత్వంలో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని.. ఆయన తనకు ఇంతకుముందే తనకు ఇంకో కథ చెప్పాడని మధుర శ్రీధర్ వెల్లడించాడు.

ఈ సినిమా గురించి.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ‘‘ఒక మనసు చేస్తున్నప్పుడే రామరాజు నాకు ఇంకో ఐడియా చెప్పాడు. అది కూడా మంచి ప్రేమకథ. కొత్త నటీనటులతో చేసే అవకాశముంది. ఇక నా దర్శకత్వంలో సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. సరైన కథ దొరకక పోవడం వల్లే మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. ఈ ఏడాది ఆఖర్లో స్వీయ దర్శకత్వంలో సినిమాను నిర్మిస్తా’’ అని చెప్పాడు శ్రీధర్.

విక్కీ డోనర్ రీమేక్.. క్రికెటర్ శ్రీశాంత్ మీద బయోపిక్.. ఈ రెండు ప్రాజెక్టుల్ని మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేయడం గురించి చెబుతూ.. ‘‘రీమేక్ సినిమా అనగానే ప్రతి సన్నివేశాన్ని పట్టి పట్టి చూస్తారు. అన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ‘విక్కీ డోనర్’ రీమేక్ సంగతి పక్కనబెట్టేశా. ఇక శ్రీశాంత్ తో సినిమా స్క్రిప్టు కూడా రాశాను. శ్రీశాంత్ బాగానే ఆసక్తి చూపించాడు. కానీ అతను సినిమాటిక్ క్లైమాక్స్ కోరుకున్నాడు. నేను రియలిస్టిగ్గా ఉండేలా క్లైమాక్స్ చెప్పాను. దీని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు’’ అని శ్రీధర్ వెల్లడించాడు.
Tags:    

Similar News