స్టార్ హీరో సినిమాకు శరాఘాతం

Update: 2017-09-23 16:26 GMT
ఈ ఏడాది సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘మెర్శల్’ ఒకటి. ‘తెరి’ తర్వాత విజయ్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మొన్న రిలీజైన ‘మెర్శల్’ టీజర్ యూట్యూబ్ లో ఎలా ప్రకంపనలు రేపుతోందో తెలిసిందే. దీపావళి కానుకగా రిలీజయ్యే ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్ చూశాక విజయ్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఐతే ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లేలా మద్రాస్ హైకోర్టు ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది.

‘మెర్శల్’ అనే టైటిల్ తనదని.. దాన్ని రిజిస్టర్ కూడా చేయించానని.. దీన్ని అక్రమంగా విజయ్ సినిమా బృందం వాడేసుకుందని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ‘మెర్శల్’ టీం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టైటిల్ వినియోగం అక్రమమని తేలుస్తూ.. వచ్చే పది రోజుల పాటు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ లోపు కేసు విచారించి తీర్పు ఇస్తామంది. ఐతే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి ‘మెర్శల్’ టీం.. నెల రోజుల పాటు ప్రమోషన్‌తో హోరెత్తించాలని అనుకుంది. ఇందులో భాగంగానే ముందుగా టీజర్ రిలీజ్ చేసింది. వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటుండగా.. హైకోర్టు వాళ్లకు బ్రేక్ వేసేసింది. ఇది సినిమాకు చేటు చేస్తుందని భావిస్తున్నారు. అసలు సినిమా రిలీజ్ మీద కూడా దీని ప్రభావం పడుతుందేమో అని కూడా చిత్ర బృందం కంగారు పడుతోంది.
Tags:    

Similar News