మూవీ రివ్యూ : గాంధీ తాత చెట్టు

Update: 2025-01-23 11:44 GMT

'గాంధీ తాత చెట్టు' మూవీ రివ్యూ

నటీనటులు: సుకృతి వేణి బండ్రెడ్డి-ఆనంద చక్రపాణి-రాగ్ మయూర్-భాను ప్రకాష్-నేహాల్ ఆనంద్-రఘురాం తదితరులు

సంగీతం: రీ

ఛాయాగ్రహణం: విశ్వ దేవబత్తుల-శ్రీజిత చెరువుపల్లి

నిర్మాతలు: రవిశంకర్ యలమంచిలి-నవీన్ యెర్నేని-శేష సింధురావు

రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాది

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకమార్ కుటుంబం నుంచి ఒక వారసురాలు టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. ఆమే.. సుకృతి వేణి బండ్రెడ్డి. ఈ సుకుమార్ తనయురాలు ముఖ్య పాత్ర పోషించిన చిత్రం.. గాంధీ తాత చెట్టు. చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న 'గాంధీ తాత చెట్టు' సినిమాగా ఎంతమేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

తెలంగాణ ప్రాంతంలోని బండ్లూరు అనే గ్రామానికి చెందిన రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి)కి చిన్నతనం నుంచి గాంధీజీ అంటే అమితమైన అభిమానం. గాంధీ చనిపోయినపుడు ఆయన గుర్తుగా తమ పొలంలో తండ్రితో కలిసి నాటిన మొక్క పెద్ద వృక్షంగా మారి ఊరికి నీడనిస్తుంటుంది. ఆ చెట్టంటే రామచంద్రయ్యకు ప్రాణం. గాంధీ మీద అభిమానంతో తన మనవరాలికి కూడా గాంధీ అనే పేరు పెడతాడు రామచంద్రయ్య. ఆమెకు తాత అంటే అమితమైన ప్రేమ. తాత నేర్పిన పాఠాలతో ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ.. మంచి పనులే చేస్తూ సాగిపోతున్న గాంధీ (సుకృతి వేణి) జీవితంలో ఉన్నట్లుండి ఓ అలజడి మొదలవుతుంది. ఆ అలజడికి కారణమేంటి.. దాని వల్ల ఆమె జీవితం, తన ఊరి భవితవ్యం ఎలాంటి మలుపు తిరిగింది.. తర్వాత గాంధీ ఏం చేసింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'పుష్ప-2' సినిమా చాలా మందికి నచ్చిందని.. కానీ ఓ ఐదు శాతం మందికి మాత్రం అది రుచించలేదని.. ఆ వర్గం ప్రేక్షకుల కోసమే 'గాంధీ తాత చెట్టు' సినిమా తీశామని ఇటీవల ప్రకటించారు నిర్మాత రవిశంకర్. నిజానికి 'గాంధీ తాత చెట్టు' లాంటి సినిమాలు అందరి కోసం తీసేవి. అందరూ చూడాల్సినవి కూడా. ఇటు సినిమాలు.. అటు సామాజిక మాధ్యమాల్లో చెడునే నెగెటివిటీతో నిండిపోతున్న రోజుల్లో కాస్త మంచి చెప్పి.. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించే సినిమాలు అరుదుగానే వస్తుంటాయి. ఆ కోవలోని చిత్రమే.. గాంధీ తాత చెట్టు. ఒక చెట్టు మీద ఇద్దరు మనుషుల ప్రేమ.. దాన్ని కాపాడ్డం కోసం వాళ్లు చేసే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ విని.. ఇందులో అంత డ్రామా ఏముంటుంది.. ఇలాంటి పాయింట్ మీద రెండు గంటల సినిమా ఎలా నడిపిస్తారు అని సందేహాలు కలుగుతాయి కానీ.. దర్శకురాలు పద్మావతి మల్లాది ఆసక్తి రేకెత్తించే కథనంతో ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగింది. తిథి.. మెయిల్.. సినిమా బండి.. తరహాలో కొంచెం నెమ్మదిగా.. రియలిస్టిగ్గా సాగే సినిమాలను ఇష్టపడేవారికి 'గాంధీ తాత చెట్టు' మంచి ఛాయిసే.

'గాంధీ తాత చెట్టు' కథ మరీ కొత్తగా.. షాకింగ్ గా ఏమీ అనిపించదు. ఒక ఊరిలో పంటలు సరిగ్గా పండక.. పండినా సరైన ధర రాక ఇబ్బంది పడే రైతులు.. ఫ్యాక్టరీ పేరుతో డబ్బుల ఆశ చూపి భూములు సొంతం చేసుకోవాలని చూసే పెట్టుబడి దారులు.. దీనికి వ్యతిరేకంగా పోరాడి గెలిచే ఓ కథానాయిక.. ఇదీ స్థూలంగా ఇదీ కథ. ఐతే రైతులు.. పెట్టుబడి దారులు.. పోరాటం.. అనగానే దశాబ్దాల వెనకటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇదేమీ విప్లవ సినిమాల టైపు కాదు. పాయింట్ పాతదే అయినా.. దీన్ని కొంచెం కొత్తగా.. సరదాగా.. సహజంగా డీల్ చేయడానికి ప్రయత్నించింది దర్శకురాలు పద్మావతి. పిల్లలకు నిజం మాత్రమే చెప్పాలని పెద్దవాళ్లు చెబుతారు కానీ.. మళ్లీ ఆ పిల్లలు నిజాలు మాట్లాడ్డం మొదలుపెడితే నోరు కట్టేసేది కూడా పెద్దవాళ్లే. నిజాలు మాత్రమే మాట్లాడి ఈ సమాజంలో బతకడం కష్టం కాబట్టి పిల్లలు కూడా పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుని అబద్ధాలకు అలవాటైపోతారు. కానీ ఓ అమ్మాయి తనకు తన తాత నేర్పిన ఆదర్శాలకు కట్టుబడి నిజాలే మాట్లాడుతూ.. మంచి మాత్రమే చేస్తూ సాగితే ఎలా ఉంటుందో సుకుమార్ తనయురాలు సుకృతి చేసిన గాంధీ పాత్రలో చూస్తాం. కాపీ కొడుతున్నారని తన స్నేహితులనే ఉపాధ్యాయుడికి పట్టించి.. మళ్లీ వాళ్లు దెబ్బలు తింటుంటే బాధ పడడం.. ఆ తర్వాత ఆ స్నేహితుల చేతుల్లో అడిగి మరీ దెబ్బలు తినడం.. ఇలా సాగే గాంధీ పాత్రను చూశాక దాని మీద ఒక ఆపేక్ష కలుగుతుంది. మొదట్లోనే ఈ పాత్రతో కనెక్ట్ కావడంతో తర్వాత దాంతో అలా అలా ట్రావెల్ అయిపోతాం.

'గాంధీ తాత చెట్టు'లో ప్రేక్షకులను కదిలించే మరో రెండు పాత్రలున్నాయి. అందులో ఒకటి చెట్టును ఒక స్నేహితుడిలా భావించి దాన్ని అమితంగా ప్రేమించే రామచంద్రయ్య పాత్ర. ఏమాత్రం నాటకీయత లేకుండా మాట్లాడే.. ప్రవర్తించే ఆ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే తనికెళ్ల భరణి గాత్రదానం చేసిన చెట్టు సైతం ఒక పాత్రలాగే ఆడియెన్సుకు కనెక్ట్ అవుతుంది. ఒక చెట్టు తన భావోద్వేగాలను వ్యక్తం చేయడం గురించి ఎవరైనా చెబితే నాటకీయంగా అనిపిస్తుంది కానీ.. సినిమా చూస్తున్నపుడు ఆ భావన కలగదు. తన మీద గొడ్డలి వేటు పడ్డపుడు చెట్టు తన బాధను వ్యక్తం చేసినపుడు కదిలిపోని ప్రేక్షకుడు ఉండడు. కథాకథనాల్లో మరీ కొత్త సీన్లు లేకపోయినా.. సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ముందుకు నడిపిస్తాయి. తన భూమి కొనడానికి వచ్చిన ఫ్యాక్టరీ ప్రతినిధితో రామచంద్రయ్య పాత్ర సంభాషించే సీన్ సినిమాలో హైలైట్‌ గా నిలుస్తుంది. ఆ సన్నివేశంలో డైలాగులు కూడా భలేగా అనిపిస్తాయి. పెళ్లి చూపులు తప్పించుకోవడానికి గాంధీ పాత్ర వేసే ఎత్తుగడ కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. గాంధీ ఆదర్శాలనే ఆయుధాలుగా చేసుకుని కథానాయిక సింపుల్ గా ఊరి సమస్యను పరిష్కరించే వైనం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ హృద్యంగా సాగుతుంది. ఐతే చాలా వరకు రియలిస్టిగ్గా సాగే ఈ సినిమాలో కథానాయిక చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం తయారు చేసి ఊరి వాళ్లను ఆశ్చర్యపరిచే ఎపిసోడ్ ఒక్కటి కొంచెం అతిశయంగా అనిపిస్తుంది. షుగర్ ఫ్యాక్టరీకి చెరకును పంపే ఊరి జనాలకు బెల్లం తయారీ గురించి తెలియకపోవడం.. దాన్నొక ప్రత్యామ్నాయంగా గుర్తించకపోవడం విడ్డూరమే. ఇక కథ ఓల్డ్ స్టయిల్లో ఉండడం.. నరేషన్ కొంచెం నెమ్మదిగా సాగడం సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్సులు. కానీ ఈ ప్రతికూలతల్ని విస్మరించదగ్గ మంచి సినిమాలు సినిమాలు చాలానే ఉన్నాయి.

నటీనటులు:

ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో 'తబిత సుకుమార్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్' అని వేసుకున్నారు సుకుమార్ సతీమణి. ఈ తల్లిదండ్రులిద్దరూ తమ కూతురి విషయంలో కచ్చితంగా గర్వించవచ్చు. ఒక టీనేజీ అమ్మాయి పాత్ర కోసం గుండు కొట్టించుకుని నటించడం అంటే చిన్న విషయం కాదు. ఈ సాహసం చేయడమే కాదు.. పాత్రకు తగ్గట్లు అమాయకత్వం ఉట్టిపడేలా నటించడంలో సుకృతి చేసిన కృషి ప్రశంసనీయం. ఆమె నటిస్తోంది అనే భావన ఎక్కడా కలగదు. నిజంగా గాంధీ అనే అమ్మాయి ఉందనే భావన కలిగేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది సుకృతి. రామచంద్రయ్య ఆనంద చక్రపాణి కూడా గొప్పగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ బలమైన ముద్ర వేశాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ను టాలీవుడ్ మరింతగా ఉపయోగించుకోవాల్సిన అవసరముంది. సుకృతి తల్లిదండ్రులుగా చేసిన ఆర్టిస్టులిద్దరూ బాగా చేశారు. మాస్టారిగా చేసిన పెద్దాయన.. కథానాయిక స్నేహితులుగా చేసిన కుర్రాళ్లు కూడా చక్కగా నటించారు. ఫ్యాక్టరీ ప్రతినిధిగా రాగ్ మయూర్ అదరగొట్టాడు. తెరపై కనిపించకపోయినా.. తన గొంతులో చెట్టు పాత్రకు తనికెళ్ల భరణి ప్రాణం పోశారు.

సాంకేతిక వర్గం:

'గాంధీ తాత చెట్టు' టెక్నికల్ హంగులు బాగానే కుదిరాయి. రీ సంగీతం.. విశ్వ దేవబత్తుల-శ్రీజిత చెరువుపల్లి ఛాయాగ్రహణం ఇండీ సినిమాల స్టయిల్లో సాగుతూ.. సినిమాకు ఆకర్షణగా మారాయి. ఒక ఊరిలో పెద్దగా ఖర్చు లేకుండా సింపుల్ గా సినిమా తీసేసింది చిత్ర బృందం. ఇలాంటి కథకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు అభినందనీయులు. పద్మావతి మల్లాది రచయితగా.. దర్శకురాలిగా ప్రతిభను చాటుకుంది. ఈ రోజుల్లో ఇలాంటి కథను వెండితెర మీదికి తీసుకురావాలన్న ఆమె అభిరుచిని ప్రశంసించాల్సిందే. ఓ మంచి కథను అర్థవంతమైన పాత్రలు.. చక్కటి సంభాషణలతో.. హృద్యమైన ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసింది పద్మావతి.

చివరగా: గాంధీ తాత చెట్టు.. ఓ మంచి సినిమా

రేటింగ్- NA

Tags:    

Similar News